తెల్లవారకుండానే తెల్లారిన బతుకులు

Four Dead in Car Accident YSR Kadapa - Sakshi

కేశాపురం చెక్‌పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం

ఎదురుగా వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లిన కారు

కారు డ్రైవరుతోపాటు మరో ముగ్గురు దుర్మరణం

మృతులలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు

తెల్లవారుజామున జరిగిన దుర్ఘటన

కడప కార్పొరేషన్‌/కడప అగ్రికల్చరల్‌/చిన్నమండెం/రాయచోటి : మరి కాస్సేపట్లో ఇంటికి చేరుకోనున్న వారంతా అనూహ్యంగా విగతజీవులయ్యారు. తెలతెలవారక ముందే వారి బతుకులు తెల్లవారిపోయాయి. చిన్నమండెం మండలం కేశాపురం చెక్‌పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కుటుంబీకులను శోకసముద్రంలో ముంచింది. నలుగురు ప్రాణాలు తీసిన దుర్ఘటన తీవ్ర విషాదం నింపింది. మృతులలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా మరొకరు వాహన డ్రైవరు. కడప నగరం అంబాభవానీ నగర్‌కు చెందిన జగదీష్‌(48) కిరాణా వ్యాపారం చేసేవాడు. ఆయన అన్న రాజా కూడా అదే వ్యాపారంలో ఉన్నాడు. వీరి కుటుంబాలు అన్యోన్యతతో కలిసుండేవి. జగదీష్‌కు కుమార్తె పండు..కొడుకు హర్షవర్ధన్‌ ఉన్నారు.  హర్ష ఇటీవలేబీటెక్‌ పూర్తి చేశాడు. పండుకు వివాహమైంది.  ఈ మధ్య ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. బెంగళూరులో చికిత్స పొందుతోంది. ఆమెను చూసి వద్దామని జగదీష్‌ తన కుమారుడు హర్ష(20), వదిన భూదేవి(45)లతో కలిసి గురువారం ఉదయం బెంగళూరు వెళ్లారు. కారు బాడుగకు మాట్లాడుకుని డ్రైవర్‌ బాషా(40)ను తీసుకెళ్లారు. కుమార్తెను చూసి గురువారం రాత్రి  వీరంతా కడపకు బయలుదేరారు. తెల్లవారుజామున చిన్నమండెం మండలం కేశాపురం చెక్‌పోస్టు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ ఖాదర్‌బాషా, జగదీశ్వరరావు, భూదేవి తీవ్రంగా గాయపడి అక్కడే ప్రాణాలు విడిచారు. కొనఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్న  హర్షవర్ధన్‌ కాస్సేపు మృత్యుపోరాటం చేశాడు. కేశాపురం గ్రామస్థులు, వాహనాలలో వెళుతున్న ప్రయాణికులు సంఘటన స్థలానికి చేరుకుని హర్షవర్ధన్‌ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నించారు. 108 ద్వారా ఆసుపత్రికి తరలిస్తుండగానే హర్షవర్ధన్‌ కూడా చనిపోయాడు..కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. మృతుల శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా మారాయి.

అలముకున్న విషాదం
ఎదురుగా వస్తున్న లారీని గుర్తించి క్రాస్‌ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. లేదా తెల్లవారుజామున కారు  డ్రైవర్‌ నిద్ర వల్ల రెప్పమూతపడినా ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.  చిన్నమండెం సింగిల్‌ విండో మాజీ అధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డి చొరవ తీసుకుని స్థానికుల సహకారంతో వాహనాల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీయించారు. లారీ కిందకు దూసుకుపోయిన కారును వెనక్కు లాగినా అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.  ఏఎస్‌ఐ నాగరాజు సిబ్బందితో హుటాహుటిన చేరుకున్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె సిఐలు రాజు, యుగందర్‌లు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.  కడప నగరంలోని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు.  మృతదేహాలను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పంచనామా అనంతరం సాయంత్రం కడపలోని ఇంటికి మృతదేహాలను తరలించారు. మృతదేహాలు చేరగానే కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. కలిసికట్టుగా ఉన్న అన్నదమ్ముల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందంటూ ఇరుగుపొరుగు కన్నీటి పర్యంతమయ్యారు. మరో మృతుడు డ్రైవర్‌ బాషా ఇంటి వద్ద కూడా విషాదఛాయలు అలముకున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top