కుప్పకూలిపోయారు!

Five Workers Died After Govt Double Bedroom Construction Collapse At Keesara - Sakshi

‘డబుల్‌ బెడ్‌రూం’ నిర్మాణ పనుల్లో అపశ్రుతి 

ప్లాట్‌ఫాం కుప్పకూలడంతో ఐదుగురు కూలీలు దుర్మరణం 

కీసర మండలం రాంపల్లిలో ఘటన

ఏఈ సస్పెన్షన్‌ 

సాక్షి, కీసర: మేడ్చల్‌ జిల్లా కీసర మండలం రాంపల్లిలో జరుగుతున్న డబుల్‌బెడ్‌రూం నిర్మాణపనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని రాష్ట్రం దాటి వచ్చి పనిచేస్తున్న వీరు ఒక్కసారిగా విగతజీవులుగా మారడం తోటికూలీలను కలచివేసింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని పేదల కోసం రాంపల్లిలోని 40 ఎకరాల విస్తీర్ణంలో 52 బ్లాక్‌ల్లో 6,240 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తోంది. గత ఏడాది అప్పటి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఇక్కడ బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌ , ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు రెండువేల మంది కూలీలు షిప్టులవారీగా పనిచేస్తున్నారు.
 
టైరాడ్‌ సరిగా బిగించకపోవడం వల్లే... 
రోజూలాగే గురువారం ఉదయం తొమ్మిది గంటలకు దాదాపు 1,500 నుంచి 2,000 మంది కూలీలు పనిమొదలెట్టారు. సుమారు 11 గంటల సమయంలో 12వ బ్లాక్‌లోని పదో అంతస్తులో ఫ్లాట్‌ఫాంపై నిలబడి ఆరుగురు కూలీలు పనిచేస్తున్నారు. అది ఒక్కసారిగా కుప్పకూలింది. వారు కూడా దాంతోపాటే కిందపడిపోయారు. ఈ ఘటనలో బిహార్‌కు చెందిన యాష్‌కుమార్‌చౌదరి(20), పశ్చిమ బెంగాల్‌వాసులు సుభాల్‌రాయ్‌(32,) సైపుల్‌హాక్‌(26), అభిజిత్‌రాయ్‌(22)లు రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలొదిలారు. మిలాన్‌షేక్‌(20) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మరొకరు విబ్లవ్‌రాయ్‌(18) తీవ్రగాయాలతో ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కోపోద్రిక్తులైన తోటి కూలీలు ఆగ్రహంతో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల సముదాయంలోని కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయం అద్దాలు, కంప్యూటర్లు, కుర్చీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఉద్యోగులు, సిబ్బందిపై దాడి చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

అంబులెన్స్‌ కూడా అందుబాటులో లేదు... 
ఇంతపెద్ద సంఖ్యలో పనిచేసే కూలీలకు అక్కడ ఎలాంటి సౌకర్యాలుగాని, రక్షణ చర్యలుగాని లేవని, పనిచేసే సమయంలో ప్రమాదం జరిగితే కనీసం చికిత్స అందించేందుకు వసతులు కూడా లేవని కూలీలు కన్నీళ్ల పర్యంతమయ్యారు. అంబులెన్స్‌కూడా అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలతోపాటు గాయపడినవారిని ఆటోట్రాలీలో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని తెలిపారు. నిర్మాణ పనులు జరుగుతున్న చోట కనీసం మరుగుదొడ్లు కూడా లేవని, ఇటీవల ఓ కూలి బహి ర్భూమికని రాత్రివేళలో సమీపంలోని రైల్వేట్రాక్‌ దాటి వెళ్లడంతో రైలు ఢీ కొని మృతిచెందాడని చెప్పారు.  

ఏఈ సస్పెన్షన్‌.. 
రాంపల్లి దుర్ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఏఈ ఎస్‌.నర్సరాజును సస్పెండ్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రతాచర్యలు చేపట్టడంలో విఫలమైనందుకు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.  

రూ. 15 లక్షల చొప్పున పరిహారం 
రాంపల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందడంపై నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. 

కానరాని భద్రత... 
ప్రమాద సమయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడింది. ప్లాట్‌ఫామ్‌కు టైరాడ్‌ సరిగా బిగించారా...లేదా... భద్రంగా ఉందా లేదా అని పరీక్షించే ఇంజనీరింగ్‌ విభాగ అధికారులెవరూ అక్కడ లేరు. కూలీలకు కనీసం హెల్మెట్‌లు, సేఫ్టీ బెల్ట్‌లు కూడా అందించలేదు. కూలీల పనులను పర్యవేక్షించే సూపర్‌వైజర్లు కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. ప్రమాదవశాత్తూ కిందపడినా గాయాలబారిన పడకుండా జాలీలు ఏర్పాటు చేయకపోవడంతోనే ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారని సహచర కూలీలు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ఘటనాస్థలాన్ని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, రాచకొండ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు, మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.  


ప్రమాదం జరిగిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల సముదాయం ఇదే 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top