కడచూపు కోసం వచ్చి కానరాని లోకాలకు | Five deceased in road accident | Sakshi
Sakshi News home page

కడచూపు కోసం వచ్చి కానరాని లోకాలకు

Jul 4 2020 5:05 AM | Updated on Jul 4 2020 5:05 AM

Five deceased in road accident - Sakshi

కేవీపల్లె (చిత్తూరు జిల్లా): రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ బంధువును చివరిసారి చూసేందుకు వచ్చిన ఓ కుటుంబం తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికై మృత్యువాత పడింది. వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఐదుగురు మరణించగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. 

► చిత్తూరు జిల్లా కలకడ మండలం కె.బాటవారిపల్లె పంచాయతీ కొత్తగాండ్లపల్లెకు చెందిన మహేష్‌బాబు (19) శుక్రవారం చిత్తూరు – కడప జాతీయ రహదారిలో స్కూటర్‌పై వస్తూ అదుపు తప్పి పడిపోవడంతో మృతి చెందాడు. 
► మహేష్‌బాబు మృతదేహం పీలేరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉండటంతో కడచూపు చూడడానికి అతని తాత కొత్తగాండ్లపల్లెకు చెందిన ఆర్‌.వెంకటరమణ (65), ఆయన పెద్ద భార్య పార్వతమ్మ (60), చిన్నభార్య సుజాతమ్మ (58), కుమార్తె రెడ్డి గోవర్ధని (21), బంధువులైన ఆటో డ్రైవర్‌ దామోదర్‌ (35), కేవీపల్లె మండలం గాండ్లపల్లెకు చెందిన నీలావతి (34), ఆమె కుమార్తె పుష్పావతి (18) ఆటోలో పీలేరుకు వచ్చారు. 
► మృతదేహాన్ని చూసి, తిరిగి శుక్రవారం రాత్రి ఆటోలో కొత్తగాండ్లపల్లెకు పయనమయ్యారు. మార్గం మధ్యలో ఎదురుగా వచ్చిన ఐచర్‌ వాహనం వీరి ఆటోను ఢీకొంది. 
► వెంకటరమణ, పార్వతమ్మ, సుజాతమ్మ, రెడ్డిగోవర్ధని అక్కడికక్కడే మృతి చెందారు. దామోదర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నీలావతి, పుష్పావతి చికిత్స పొందుతున్నారు. కేవీపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా జరిగింది: ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఐషర్‌ 
(మినీ లారీ) ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ఎప్పుడు, ఎక్కడంటే : శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం సొరకాయలపేట చెరువు కట్టపై ప్రమాదం. 
పర్యవసానం : అక్కడికక్కడే నలుగురు, ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement