మరణ మృదంగం | Family Suicide in Nalgonda District | Sakshi
Sakshi News home page

మరణ మృదంగం

Dec 23 2017 10:47 AM | Updated on Dec 23 2017 10:47 AM

Family Suicide in Nalgonda District  - Sakshi

తినే ఆహారంలో విష పదార్థాలు కలిశాయా..? క్రిమిసంహారక మందు కలుపుకుని మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడ్డారా..?  ఎవరైన హత్య చేశారా..? ఇలా అంతుచిక్కని ప్రశ్నలెన్నో.. మరెన్నో సందేహాలు. కారణాలు ఏమైతేనేం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో శుక్రవారం తెల్లవారుజామున మరణమృదంగం ప్రతిధ్వనించింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పదంగా విగత జీవులవడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర కలకలంరేపింది.

నల్లగొండ జిల్లా, రాజాపేట (ఆలేరు) : సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం మునిగడపకు చెందిన దుబ్బాసి బాలరాజు(44), భార్య నిర్మల(40) దంపతులు. వీరికి కుమార్తె శ్రావణి (15), కుమారులు చింటు (12, బన్నీ (8) ఉన్నారు. బాలరాజు సికింద్రాబాద్‌ కూషాయిగూడ, జమ్మికుంటకు వెళ్లి కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా బాలరాజుకు అప్పుడ్పుడు ఫిట్స్‌ రావడం, వచ్చే కూలి డబ్బులు సరిపోక కుటుంబ పోషణ భారంగా మారింది. చేసిన అప్పులకు తన తోబుట్టువులు అండగా నిలిచినా సరిపోలేదు. దీంతో బాలరాజు నెల రోజుల క్రితం రాజాపేట మండల కేంద్రానికి చెందిన బెజుగం నాగభూషణం పౌల్ట్రీఫాంలో పనిచేసేందుకు మాట్లాడుకున్నాడు.

బాలరాజు ఏడాది క్రితం రాజాపేటలోని ఓ పౌల్ట్రీ ఫాంలో పనిచేసిన అనుభవం ఉండటంతో నాగభూషణం నెలకు రూ. 8వేలు ఇచ్చేందుకు అగీకరించాడు. అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బుతో కడుపునొప్పితో బాధపడుతున్న కుమార్తెకు ఆపరేషన్‌ చేయించాడు. బాలరాజు మామ జనగాం జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన బాలనర్సయ్య(68) వారం రోజుల క్రితం పాముకుంట శివారులోని ఓ దాబాలో పనిచేస్తూ జీవిస్తున్నాడు. కాగా ఇటీవల బాలరాజుకు ఫిట్స్‌ ఎక్కువగా రావడంతో ఆస్పత్రిలో చేర్పించేందుకు భార్య నిర్మల తన తల్లిదండ్రులు భారతమ్మ(60), బాలనర్సయ్యలను మూడు రోజుల క్రితం ఇంటికి పిలిపించుకుంది. నిర్మల గురువారం రాత్రి చికెన్‌ తీసుకొచ్చి వంట చేసింది. రాత్రి పౌల్ట్రీ పనులు ముగించుకుని కుటుంబ సభ్యులంతా కలిసి భోజనాలు చేసి నిద్రించారు.

పలుమార్లు ఫోన్‌చేసినా..
పౌల్ట్రీ యజమాని నాగభూషణం రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చేసరికి బాలరాజు కుటుంబ సభ్యులు నిదురించి ఉండటాన్ని గమనించి తిరిగి వెళ్లాపోయాడు. రాత్రి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదని, సమీపంలోని వ్యవసాయ బావివద్ద ఉన్న ఓ రైతును పంపించినా వారు లేవలేదని పౌల్ట్రీ యజమాని తెలిపాడు. ఉదయం 4గంటల సమయంలో వచ్చి చూసేసరికి కుటుంబ సభ్యులతంతా విగతజీవులై పడిఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశాడు. 

నష్టపరిహారం చెల్లించాలని బంధువుల డిమాండ్‌
తమ కుటుంబ సభ్యులను చంపేశారంటూ బాలరాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  తమకు నష్టపరిహారం అందించాలని పౌల్ట్రీ యజమానిని డిమాండ్‌ చేశారు. నష్టపరిహారంగా రూ.70లక్షలు ఇవ్వాలంటూ కోరారు. ఇందుకు పౌల్ట్రీ యజమాని అంగీకరించకపోవడంతో ఇరువర్గాల పెద్దలు చర్చలు జరిపారు. మృతుల కుంటుంబాలకు ఆర్థికసాయంగా రూ.4 లక్షలు అందజేసేందుకు అంగీకరించారు.

రాజాపేటలో విషాదం
రాజాపేట శివారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన మండలమే కాకుండా ఇతర జిల్లాలకు పాకడంతో, బంధువులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తాం : కలెక్టర్‌ అనితారామచంద్రన్‌
భువనగిరిఅర్బన్‌  : మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకవచ్చారు. ఈ మేరకు కలెక్టర్‌ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం గదిలో ఉన్న మృతదేహాలను సందర్శించారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. పోలీస్‌ విచారణ కొనసాగుతుందని, త్వరతిగతిన విచారణ చేసి కారణం ఏమిటో తెలుసుకుంటామన్నారు. అనంతరం మృతుల కుటుంబాలను పరమర్శించారు.

మృతదేహాల తరలింపు
విషయం తెలుసుకున్న బంధువులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి సొంత గ్రామమైన సిద్దిపే ట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని మునిగడప గ్రామానికి తరలించారు. వృద్ధ దంపతుల మృతదేహాలను జనగాం జిల్లా లింగాల గ్రామానికి తీసుకెళ్లారు.

పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం
రాజాపేట శివారులోని పౌల్ట్రీఫాంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్లూజ్‌టీమ్స్, డాగ్‌స్కాడ్స్‌ను రప్పించాం. సంఘటన స్థలంలో పురుగులమందు, కొన్ని ఆధారాలు దొరికాయి, పరీక్షల నిమిత్తం పంపించాం. బాలరాజు అన్న రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నాం. పోస్టుమార్టం చేసిన తర్వాతనే పూర్తి వివరాలు తెలుస్తాయి. – డీసీపీ రామచంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement