నమ్మించి.. దోచేశాడు! 

Fake SI Arrested For Cheating Woman - Sakshi

ఎస్‌ఐనని యువతితో ప్రేమ వివాహం  

చదువుల కోసమని నగదు, బంగారం వసూలు  

నకిలీ ఎస్‌ఐ అని తేలడంతో పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు  

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెల్‌కు కేసు బదిలీ  

పోలీసుల అదుపులో నకిలీ ఎస్‌ఐ రామచంద్రరావు 

గోపాలపట్నం (విశాఖ పశ్చిమ):  సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ని అంటూ ఓ నకిలీ ఐడీ కార్డు... నాలుగు మాయ మాటలు... అవే పెట్టుబడిగా ఓ యువతిని నమ్మించి మోసగించిన నకిలీ ఎస్‌ఐపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.రూ.12.8లక్షలు దోచుకోవడంతోపాటు బంగారు ఆభరణాలూ తాకట్టు పెట్టేశాడని... నమ్మించి పెళ్లి చేసుకుని మోసగించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గవర కంచరపాలెంలో నివాసముంటున్న పైడి ధనలక్ష్మికి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోటకు చెందిన పైడి రామచంద్రరావుతో పరిచయం ఏర్పడింది. తాను ఎస్‌ఐని అని, ప్రస్తుతం సస్పెండ్‌లో ఉన్నానని... గ్రూప్‌ – 1 పరీక్షల కోసం సిద్ధమవుతున్నానని నమ్మించాడు. కొన్నాళ్లకు ఆ పరిచయం ప్రేమగా మారడంతో గత ఏడాది జూన్‌ 19న నగరంలోని వన్‌టౌన్‌లోని వరసిద్ధి వినాయక ఆలయంలో కులాంతర వివాహం చేసుకుని రిజిస్టర్‌ చేయించారు.

అయినప్పటికీ పెళ్లి వ్యవహారమంతా బయటకు పొక్కకుండా, తన కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. తన చదువుల కోసం డబ్బులు అవసరమంటూ ధనలక్ష్మి తండ్రి నుంచి పలుమార్లు డబ్బులు రామచంద్రరావు తీసుకున్నాడని.., తన బంగారు ఆభరణాలు సైతం తాకట్టు పెట్టాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకుని మోసం చేశాడని, తమ పెళ్లి విషయం తెలిసిన రామచంద్రరావు తల్లి పైడి జయలక్ష్మి, ఆడపడుచు దేవిక కులం పేరుతో దూషించారని, గవర కంచరపాలెంలో పెద్ద మనుషులపంచాయితీలో కూడా తన కుటుంబాన్ని దూషించారని ఫిర్యాదులో పేర్కొంది. నమ్మించి మోసానికి పాల్పడిన రామచంద్రరావుపై చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రామచంద్రరావును ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెల్‌కు బదిలీ చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top