మైసూరులో నకిలీ ఎస్సైకి బేడీలు

Fake Police Arrested In Mysore Who Cheats Youth With Fake Facebook ID - Sakshi

అమ్మాయి పేరిట చాటింగ్‌

యువకులను బెదిరించి డబ్బు వసూలు చేసిన వైనం

మహిళ, ఆమె భర్త ఫిర్యాదుతో వెలుగులోకి

సాక్షి, బెంగళూరు : పోలీసు అధికారినని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ఎస్‌ఐని బుధవారం ఉదయగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. హుబ్లి నగరానికి చెందిన సిద్దప్ప ఫేస్‌బుక్‌లో భవిక పేరుతో నకిలీ ఖాతా తెరచి యువకులతో అమ్మాయినని చాటింగ్‌ చేసేవాడు. యువకుల మొబైల్‌ నంబర్లు తీసుకొని వాయిస్‌ ఛేంజర్‌ సాఫ్ట్‌వేర్‌తో అమ్మాయిలా మాట్లాడుతూ వ్యక్తిగత వివరాలు సేకరించి ప్రేమ పేరుతో వారిని ముగ్గులోకి దించేవాడు. ఇలా కొద్ది రోజులు గడచిన అనంతరం అసలు నాటకానికి తెర తీసేవాడు. భవిక అనే అమ్మాయి ఫిర్యాదు చేసిందంటూ పోలీసు వేషధారణతో యువకులను బెదిరించి కేసు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేసేవాడు. ఇలా మైసూరుతో పాటు బెంగళూరు తదితర ప్రాంతాల్లో యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు.  

మైసూరు మహిళకు బెదిరింపులు
ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం మైసూరు నగరంలోని శక్తి నగర్‌కు చెందిన శారదమ్మ అనే మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్న నిందితుడు మాటల్లో శారద కుమారుడు బెంగళూరులో పని చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. అనంతరం మంగళవారం ఎస్‌ఐ వేషంలో కారులో శారదమ్మ ఇంటికి వచ్చిన సిద్దప్ప బెంగళూరులో మీ కుమారుడు ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేసినట్లు తమకు ఫిర్యాదులు అందాయని అందుకు సంబంధించి విచారణకు వచ్చామంటూ నమ్మించాడు. అయితే తనకు రూ.50వేలు లంచం ఇస్తే మీ కుమారుడిని కేసు నుంచి తప్పిస్తానంటూ సూచించాడు. సిద్దప్ప మాటలు నిజమేనని నమ్మిన శారదమ్మ ఇంట్లో ఉన్న రూ.5వేల నగదును అతడికి ఇచ్చింది. అయితే మొత్తం ఇవ్వాల్సిందేనంటూ సిద్దప్ప డిమాండ్‌ చేయడంతో ఇంట్లోనే ఉన్న శారదమ్మ భర్త నారాయణగౌడకు నిందితుడి ప్రవర్తనపై అనుమానం కలగడంతో ఇక్కడే ఉండాలని బ్యాంకు నుంచి డబ్బులు తెస్తానంటూ నమ్మించి బయటకు వచ్చి ఉదయనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

ఇంటెలిజెన్స్‌ ఎస్సైనని బుకాయింపు  
సమాచారం అందుకున్న ఉదయనగర ఎస్‌ఐ జైకీర్తి సిబ్బందితో అక్కడికి చేరుకొని ప్రశ్నించగా తాను ఇంటలిజెన్స్‌ విభాగ ఎస్‌ఐనని యువతి ఫిర్యాదు మేరకు ఇక్కడికి విచారణకు వచ్చినట్లు చెప్పాడు. అయితే ఐడీ కార్డు చూపించాలని అడగడంతో పాటు ఇంటలిజెన్స్‌ విభాగానికి సంబంధించి పలు ప్రశ్నలు అడగడంతో సిద్దప్ప పూర్తిగా తడబడ్డాడు. దీంతో సిద్దప్పను స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూడడంతో సిద్దప్పపై కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top