మహిళపై కాల్పులు: మాజీ జవాన్‌ ఆత్మహత్య

Ex Army Jawan Commits Suicide At Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు:  ఓ మహిళపై నాటు తుపాకీతో కాల్పులు జరిపి పరారైన ఆర్మీ మాజీ జవాన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు బాలాజీ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ సమాచారాన్ని చెరుకుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో  మృతుడు బాలాజీ తల్లిదండ్రులను ఆదివారం ఘటనా స్థలానికి తీసుకు వెళ్లారు. మృతదేహం బాలాజీదేనని అతడి తల్లిదండ్రులు నిర్థారించారు.

కాగా పోలీసుల కథనం మేరకు కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన యేమినేని బాలాజీ గతంలో ఆర్మీలో పనిచేసేవాడు. అతను మండలంలోని నడింపల్లి గ్రామానికి చెందిన రమాదేవి కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా లొంగదీసుకున్నాడు. తీరా వివాహం చేసుకోమని యువతి ప్రశ్నించగా అదిగో ఇదిగో అంటూ కాలం గడిపి.. చివరకు తనకు సంబంధం లేదన్నాడు. దీంతో బాధిత యువతి తన తల్లితో కలిసి బాపట్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో 2019 డిసెంబర్‌ రెండో తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయడంతో బాలాజీ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వారిపై కక్ష పెంచుకున్నాడు. 

శనివారం వేకువజామున సుమారు రెండు గంటల సమయంలో తన స్నేహితుడి సాయంతో ఆటోలో నడింపల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. తలుపులు కొట్టగా యువతి తల్లి రమాదేవి తలుపులు తీసింది. అంతలో బాలాజీ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో కాల్చాడు. అప్రమత్తమైన రమాదేవి పక్కకు తప్పుకోవటంతో ఆమె చెవికి తూటా తగిలింది. తుపాకీ శబ్దం, రమాదేవి కేకలు విని స్థానికులు బాలాజీని పట్టుకునే ప్రయత్నం చేశారు. 

తుపాకీతో స్థానికులను బెదిరించి తనతోపాటు వచ్చిన ఆటో డ్రైవర్‌తో కలిసి పరారయ్యాడు. గాయపడ్డ రమాదేవిని స్థానికులు దగ్గరలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా∙స్థలానికి చేరుకుని సమీపంలో పడిఉన్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని,  కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు తనను ఎలాగైనా అరెస్ట్‌ చేస్తారనే భయంతో బాలాజీ రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top