తప్పుడు కేసులు పెట్టి.. జీవితాలు నాశనం చేశారు

employes desoppointing on cricket betting case

వైఎస్‌ఆర్‌ జిల్లా   , ప్రొద్దుటూరు క్రైం : ‘చదువుకునే సమయంలో స్నేహితులతో కలసి అప్పుడప్పుడు క్రికెట్‌ పందేలు నిర్వహించే వాళ్లం.. ఐదారేళ్ల తర్వాత ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్న సమయంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారని చెన్నూరు పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి మా జీవితాలను నాశనం చేశారు’ అని ఇద్దరు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూరుకు చెందిన ఉమ్మడి రమేష్, గుగ్గిళ్ల చాణక్య మంగళవారం ప్రొద్దుటూరులోని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ జయశ్రీని ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. తాను తిరుపతిలోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఏరియా మేనేజర్‌గా పని చేస్తున్నానని రమేష్‌ తెలిపారు. తనపై పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్, గంజాయి కేసులు పెట్టారని పేర్కొన్నారు. తాను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నానని చాణక్య చెప్పారు. పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగస్తులను తెచ్చి.. నేరస్తులుగా మారుస్తారా: నేరాలను అరికట్టాల్సిన పోలీసులు ఉద్యోగాలు చేసుకునే వారిని నేరస్తులుగా మారుస్తున్నారని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ జయశ్రీ అన్నారు. ఆమె స్వగృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు నిజమైన బుకీల జోలికి వెళ్లడం లేదని, అమాయక యువకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. యువకుల జీవితాలు రోడ్లపాలు కావడానికి కారణమైన ఎస్‌ఐ వినోద్‌కుమార్, సీఐ నాయకుల నారాయణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top