టైటిల్: బ్రాట్
నటీనటులు: డార్లింగ్ కృష్ణ, మనీషా కంద్కూర్
డైరెక్టర్: శశాంక్
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ బ్రాట్. గతేడాది అక్టోబరు 31న థియేటర్లలోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
అసలు కథేంటంటే..
క్రిస్టీ(డార్లింగ్ కృష్ణ) తన జీవితాన్ని డెలివరీ బాయ్‌గా ప్రారంభిస్తాడు. ఎంత కష్టపడినా డబ్బులు సరిపోకపోవడంతో తనలో తానే బాధపడుతుంటాడు. అలా ఓ రోజు కారులో కుక్కను చూసిన క్రిస్టీ ఊహించని విధంగా రియాక్ట్ అవుతాడు. ఆ తర్వాత డబ్బు కోసం క్రికెట్ బెట్టింగ్ వైపు అడుగులు వేస్తాడు. ఫుల్‌గా డబ్బు సంపాదిస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ అదే సమయంలో తన ఫ్రెండ్‌కు జరిగిన సంఘటన చూసి ఓ నిర్ణయం తీసుకుంటాడు. అసలు డబ్బు కోసం క్రిస్టీ క్రికెట్ బెట్టింగ్‌నే ఎందుకు ఎంచుకున్నాడు? తన ఫ్రెండ్‌కు అసలేం జరిగింది? క్రిస్టీ తండ్రి మహదేవయ్యకు తన కుమారుడితో ఉన్న ఇబ్బందులు ఏంటి? చివరికీ బెట్టింగ్‌నే కెరీర్‌గా మార్చుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే బ్రాట్ చూడాల్సిందే.
బ్రాట్ ఎలా ఉందంటే..
ఈ రోజుల్లో క్రికెట్ బెట్టింగ్ అనేది కామన్ వర్డ్ అయిపోయింది. ఈ పదం కేవలం నగరాల్లోనే కాదు.. పల్లెలకు కూడా పాకిపోయింది. అలాంటి ఈ బెట్టింగ్ కాన్సెప్ట్‌గా వచ్చిన చిత్రమే బ్రాట్. అలా ఈ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ శశాంక్ కథను తెరకెక్కించాడు. ఓ యువకుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించాడు. క్రిస్టీ బెట్టింగ్.. అతని తండ్రి పోలీస్ కావడంతో ఈ స్టోరీపై ఆసక్తిని పెంచేశాడు. పోలీస్ కానిస్టేబుల్ కుమారుడైన క్రిస్టీ బెట్టింగ్ వైపు ఎందుకు వెళ్లాడనేది ప్రేక్షకుడికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయం క్లైమాక్స్ వరకు ఎక్కడా ప్రేక్షకుడికి అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అంతా క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు సంపాదించడం.. పోలీసులకు దొరక్కుండా మేనేజ్ చేయడం.. మనీషాతో క్రిస్టీకి పరిచయం.. అది కాస్తా ప్రేమగా మారడం ఇలాంటి సంఘటనలతో కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండానే సాగుతుంది.
ఒకసారి బెట్టింగ్ కేసులో క్రిస్టీని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైతో క్రిస్టీ చెప్పిన మాటలతో దర్జాగా బయటికొచ్చేస్తాడు. ఆ తర్వాత ఈ బెట్టింగ్ సామ్రాజ్యం ఊహించని మలుపులు తిరుగుతుంది. బెట్టింగ్‌లో డాన్‌గా ఉన్న డాలర్ మనీకి(విలన్).. క్రిస్టీకి మధ్య జరిగే సీన్స్ కామెడీగా అనిపించినా.. సీరియస్‌నెస్ కనిపిస్తుంది. ఈ కథలో కామెడీకి పెద్దగా స్కోప్ లేకపోయినా.. దర్శకుడు విలన్‌తోనే ప్రేక్షకుడిని నవ్వించిన తీరు ఆకట్టుకుంటుంది. తన కుమారుడు బెట్టింగ్‌లో పడి ఏమైపోతాడోనని బాధపడుతున్న తండ్రికి క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. క్లైమాక్స్ వరకు ఎక్కడా రివీల్ చేయకుండా కథ నడిపించిన శశాంక్.. చివర్లో వచ్చే ట్విస్టులతో ప్రేక్షకుడిని ఫూల్ చేసినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే సింపుల్ కాన్సెప్ట్ అయినప్పటికీ.. నిడివి ఎక్కువ కావడంతో సెకండాఫ్ కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. బెట్టింగ్‌తో పాటు ఓ మేసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. వీకెండ్‌లో సీరియస్‌నెస్‌తో పాటు కామెడీ ఎంజాయ్ చేయాలనుకుంటే బ్రాట్ చూసేయొచ్చు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఆసక్తి ఉంటే ఓ లుక్ వేయొచ్చు.
ఎవరెలా చేశారంటే..
డార్లింగ్ కృష్ణ నటనే ఈ సినిమాకు బలం. హీరోగా తన హవాభావాలతో మెప్పించాడు. క్రిస్టీ ప్రియురాలిగా మనీషా కంద్కూర్ అదరగొట్టేసింది. గ్లామర్ అంతగా లేకపోయినా ఈ కథకు బాగానే సెట్ అయింది. అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిర, డ్రాగన్ మంజు తమ పాత్రల్లో మెప్పించారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఎడిటింగ్ అనవసర సీన్స్ ఇంకా కట్ చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నతంగా ఉన్నాయి.


