
న్యూఢిల్లీ: 2010 కామన్‌వెల్త్ క్రీడల ఏర్పాట్లలో అక్రమ నగదు చెలామణికి సంబంధించి హైదరాబాద్‌లోని ఏకేఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన రూ.11.28 కోట్లను గురువారం జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. ఈ క్రీడల కోసం టైమింగ్ స్కోరింగ్ అండ్ రిజల్టింగ్(టీఎస్‌ఆర్) వ్యవస్థ ఏర్పాటులో అవకతవకలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది.
సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. టీఎస్‌ఆర్ వ్యవస్థ కాంట్రాక్టు పొందేందుకు ఒలింపిక్ కమిటీ అధికారులు తొలుత స్విస్ టైమింగ్ లిమిటెడ్ సంస్థతో కుమ్మక్కయ్యారనీ, దీనివల్ల ఖజానాకు రూ.95 కోట్లు నష్టం జరిగిందని వెల్లడించింది. ఈ స్విస్ టైమింగ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా జెమ్ ఇంటర్నేషనల్ అనే మరో సంస్థకు సబ్ కాంట్రాక్టు కట్టబెట్టగా, సదరు సంస్థ ఏకేఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు మళ్లీ రూ.11.28 కోట్ల మేర సబ్ కాంట్రాక్టు ఇచ్చిందని ఈడీ పేర్కొంది.