80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

Due To The Speed The Bus Carrying 80 Students Is At Risk - Sakshi

రేకుల షెడ్డులోకి దూసుకెళ్లిన ప్రైవేట్‌ స్కూలు బస్సు 

నిబంధనలకు విరుద్ధంగా బస్సులో 80 మంది తరలింపు 

బస్సు డ్రైవర్‌ అతి వేగం, నిర్లక్ష్యం కారణంగా రెండు ప్రమాదాలు

భయంతో కన్నీటి పర్యంతమైన చిన్నారులు 

అంతులేని నిర్లక్ష్యం... అతి వేగం కారణంగా 80 మంది విద్యార్థుల ప్రాణాలతో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు డ్రైవర్‌ చెలగాటమాడాడు. జాతీయ రహదారిపై రోడ్డు క్రాస్‌ చేస్తూ రెండు ప్రమాదాలకు కారకుడయ్యాడు. మృత్యు కౌగిలిని అతి చేరువగా చూసి ప్రాణాలతో బయటపడ్డ చిన్నారులు భయంతో కన్నీటిపర్యంతమయ్యారు. 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఈ ఘటన సంచనలమైంది. వివరాల్లోకి వెళితే..
– కనగానపల్లి  

సాక్షి, అనంతపురం: కనగానపల్లి మండలం ముక్తాపురం వద్ద 44వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. ఘటనలో బస్సులో ఉన్న 65 మంది చిన్నారులు స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు.

నిబంధనలు తుంగలో తొక్కి... 
ధర్మవరం పట్టణంలోని ప్రియదర్శిని విద్యామందిర్‌లో కనగానపల్లి మండలంలోని ముక్తాపురంలో 20 మంది, రాంపురంలో 45 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం విద్యామందిర్‌ నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ బస్సు నడుపుతున్నారు. అయితే బస్సుల నిర్వహణలో పాఠశాల యాజమాన్యం నిబంధనలకు తిలోదకాలిచ్చేసిందన్న ఆరోపణలున్నాయి. అత్యధిక విద్యార్థులు ఉన్న రాంపురం గ్రామానికి ధర్మవరం నుంచి నేరుగా మామిళ్లపల్లి, కనగానపల్లి మీదుగా బస్సు నడపాల్సి ఉండగా... ఇందుకు విరుద్ధంగా ముక్తాపురం, ధర్మవరం మండలంలోని కామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులను కూడా కలిపారు. మొత్తం 80 మంది విద్యార్థులను ఒకే బస్సులో రోజూ బడికి, తిరిగి ఆయా గ్రామాలకు చేరవేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్కూల్‌ యాజమాన్యం ఈ విషయంలో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది.  

నిర్లక్ష్యంతోనే ప్రమాదం? 
గురువారం సాయంత్రం బడి ముగియగానే 80 మంది విద్యార్థులతో ధర్మవరం నుంచి బస్సు బయలుదేరింది. తొలుత కామిరెడ్డిపల్లికి చేరుకుని 15 మంది విద్యార్థులను అక్కడ డ్రైవర్‌ దింపేశాడు. అక్కడి నుంచి పల్లెల మీదుగా ముక్తాపురానికి బయలుదేరాడు. సాధారణంగా రోడ్డు దాటుకునే సమయంలో డ్రైవర్లు అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తుంటారు. జాతీయ రహదారిపై మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విషయంలో స్కూల్‌ బస్సు డ్రైవర్‌ అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరిచాడు. జాతీయ రహదారిపై ముక్తాపురం క్రాస్‌ వద్ద వెనుకా ముందు ఆలోచించకుండా బస్సును ఇటువైపు నుంచి అటువైపు రోడ్డులోకి వేగంగా తీసుకెళ్లాడు. అదే సమయంలో బెంగుళూరు నుంచి అనంతపురం దిశగా జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారును గమనించి బస్సును రోడ్డు దాటించే ప్రయత్నింలో మరింత వేగాన్ని పెంచాడు. అప్పటికే ప్రమాదాన్ని పసిగట్టిన కారు డ్రైవర్‌ బలంగా బ్రేక్‌లు వేసినా ఫలితం లేకపోయింది. రోడ్డును రాసుకుంటూ వచ్చిన కారు.. బస్సు వెనుక భాగాన్ని తాకింది. అదే సమయంలో బస్సును డ్రైవర్‌ రోడ్డు పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి దూకించాడు.

మిన్నంటిన హాహాకారాలు 
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కసారిగా రేకుల షెడ్డులోకి బస్సు దూసుకెళ్లడంతో అదుటుకు విద్యార్థులు కిందామీదపడ్డారు. ఏదో జరిగిపోయిందన్న భయంతో ఒక్కసారిగా ఆర్తనాదాలు చేశారు. ఆ పక్కనే ఉన్న కాలనీ వాసులందరూ మూకుమ్మడిగా అక్కడకు చేరుకుని బస్సులో ఉన్న చిన్నారులందరినీ కిందకు దింపి ఊరడించారు. అప్పటికీ చిన్నారులు స్థిమిత పడలేకపోయారు. వారి శరీరాల్లో వణుకు తగ్గలేదు. కళ్లు నిరంతరంగా వర్షించాయి. తమకు చేరువగా ఉన్న పెద్దలను కౌగిలించుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ముక్తాపురం విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. భయంతో విలవిల్లాడుతున్న చిన్నారులను ఓదార్చడం వారికి సాధ్యపడలేదు.  

అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు 
బస్సు వెనుక ప్రాంతాన్ని తాకిన కారు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. కారు డ్రైవర్‌ హరినాథరెడ్డికి కాలు విరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న కనగానపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భయంతో బిక్కచచ్చిన విద్యార్థులను మరో బస్సులో సురక్షితంగా ఇళ్లకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ కారు డ్రైవర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top