హత్యపై అనుమానాలెన్నో..

Doughts On Sirisha Murder Case - Sakshi

యువతీ యువకులకు ఎలా గది ఇచ్చారు..?

కత్తితో యువకుడు వస్తే  సెక్యూరిటీ ఏమైంది.?

హత్య విషయం గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారనే అనుమానాలు

రంగారెడ్డి, చేవెళ్ల: శంకర్‌పల్లి మండలంలోని ప్రగతి రిసార్టులో గురువారం జరిగిన శిరీష హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ప్రేమించిన యువకుడు నమ్మించి రిసార్టుకు తీసుకువచ్చి దారుణంగా కత్తితో గొంతుకొసి కడుపులో, ముఖంపై విచక్షణారహితంగా పొడిచి హత్యచేశాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కత్తితో రావడంతో అతనికి ఎవరైనా సహకరించి ఉంటారని   మృతురాలి కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. అతనితో పాటు ఉన్న వ్యక్తులు, సహకరించిన వ్యక్తులను అరెస్టు చేసి శిక్షించాలని కోరుతున్నారు. ప్రగతి రిసార్టు లాంటి పేరొందిన దానిలోకి ఎవరైనా రావాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. అలాంటిది కేవలం  ఇద్దరు పెళ్లికాని యువతీయువకులు ఆన్‌లైన్‌లో రూమ్‌ బుక్‌ చేసుకుంటే వారి వివరాలు చెక్‌ చేయకుండా ఎలా  కేటాయించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి తోడు రిసార్టులోకి ఎవరు వెళ్లినా వారిని పూర్తిగా చెక్‌చేసి డిడెక్టర్ల ద్వారా పరిశీలించి  పంపిస్తుంటారు. అలాంటిది హత్య చేసేందుకు పథకం వేసుకొని వచ్చిన యువకుడు కత్తిని ఎలా రిసార్టు లోపలికి తీసుకెళ్తే భద్రత ఏమైందని ప్రశ్నిస్తున్నారు. 

గోప్యంతోనే ఆలస్యమా..?
సాయిప్రసాద్‌తో పాటు ఎవరైనా రిసార్టులోకి వచ్చి ఉంటారని హత్య చేసేందుకు సహకరించి తరువాత దీనిని గోప్యంగా ఉంచేందుకు  ప్రయత్నించి విఫలం కావడంతోనే బయటకు వచ్చేందుకు ఆలస్యం జరిగిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య విషయం సాయంత్రం పోలీసులకు, రిసార్టు సిబ్బందికి తెలిసినప్పుడు మృతురాలి శిరీష వద్ద ఉన్న ఐడీ కార్డులు, సెల్‌ఫోన్‌ల ఆధారంగా తల్లిదండ్రులకు ఎందుకు వెంటనే సమాచారం అందించలేదని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు కనిపించలేదని, ఫోన్‌చేస్తే కలవలేదన్నారు. చివరకు రాత్రి 8 గంటలకు ఫోన్‌ చేస్తే పోలీసులమని మీరు ప్రగతి రిసార్టు వద్దకు రావాలని చెప్పారని అంటున్నారు. హత్య జరిగిన తరువాత ఇంత సమయం ఎందుకు అయిందని పలు అనుమానాలకు తావునిస్తుంది. రిసార్టు పేరు బయట పడకుండా ఉండే జాగత్ర పడ్డారా? లేక హత్య చేసిన యువకుడి వెనక పలుకుబడి ఉన్న నాయకులు ఎవరైనా ఉండి కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ పోలీసులు హత్య చేసిన యువకుడు దొరకడంతో ఆధారాల ప్రకారం తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు చెబుతున్నారు.  అంతేకాకుండా ఈ హత్యపై వస్తున్న అనుమానాలపై కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నామని డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top