వేధింపులు కూల్చిన శిల్పం

Doctor Shilpa Suicide Case Professor Ravikumar Suspend - Sakshi

మనసును దొలిచిన వేధింపులు

ప్రొఫెసర్ల మాటలే ఈటెలైన వేళ

ఫిర్యాదు చేసినా జరగని న్యాయం పీజీ వైద్య పరీక్షల్లో ఓటమి

ఆత్మహత్యకు పాల్పడిన  యువ వైద్యురాలు

వైద్యకళాశాలలో విద్యార్థుల నిరసన ప్రొఫెసర్‌ రవికుమార్‌ సస్పెన్షన్‌

ఓ విద్యాకుసుమం రాలిపోయింది. శ్రమ.. పట్టుదలతో ఉన్నత విద్యలో సోపానాలు అధి రోహించిన ఓ యువ వైద్యురాలి కథ విషాదాంతమైంది. వేధింపుల పర్వమే ఆమె హృదయాన్ని కలచివేసి చివరికి మృత్యువు ఎదుట తలవొంచేలా చేసింది. పీలేరుకు చెందిన డాక్టర్‌ శిల్ప (31) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హృదయాలను ద్రవింపజేసింది. ఆమె మృతిలో తిరుపతి వైద్యకళాశాలలో నిరసన ఎగిసింది. రుయా ఆస్పత్రి హెడ్‌ డాక్టర్‌ రవికుమార్‌ ఈ సంఘటనకు సంబంధించి సస్పెండయ్యారు.

చిత్తూరు, పీలేరు: పీలేరులో డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య సంఘటన సంచలనం సృష్టించింది. పట్టణానికి చెందిన రాధ, రాజగోపాల్‌ దంపతుల కుమార్తె శిల్ప తిరుపతి ఎస్‌వీ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివింది. అదే సమయంలో తిరుపతికి చెందిన రూపేష్‌కుమార్‌ రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకుంది. వైద్యవిద్యలో శిల్ప ప్రతిభ కనబర్చింది. పట్టభద్రురాలయ్యాక ప్రభుత్వ డాక్టర్‌గాఎంపికైంది. తంబళ్లపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించేది. సర్వీసులో ఉండగానే పీడియాట్రిక్స్‌లో ఎండీ కోర్సు సీటు వచ్చింది.  2015–16 తిరుపతి రుయాలో చేరింది. పీజీ చేస్తుండగానే నాలుగు నెలల క్రితం ప్రొఫె సర్లు రవికుమార్, కిరీటి, శశికుమార్‌ తనను వేధిస్తున్నారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసేదని భోగట్టా. స్థానికంగా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఫలితం లేకపోవడంతో గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు సంఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది.  గవర్నర్‌ ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి విచారణ జరిపింది. మానసిక స్థితి సక్రమంగా లేదంటూ ఆ కమిటీ భావిస్తున్నట్లు తెలుసుకుని డాక్టర్‌ శిల్ప తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. 

కమిటీ నివేదిక రహస్యంగా ఉంచడం, తనను వేధించిన ప్రొఫెసర్లపై ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో కుంగిపోయింది. ఈ నేపథ్యంలో  ఈ ఏడాది మే నెలాఖరులో విడుదలైన పీజీ పరీక్షల్లో ఫెయిలైంది. చదువులో ఉన్నతంగా రాణిస్తున్నా ప్రొఫెసర్లు ఫెయిల్‌ చేశారని శిల్ప ఆవేదన చెందేదని కుటుంబ çసభ్యులు చెబుతున్నారు. మరోమారు జవాబుపత్రాల దిద్దుబాటు చేయిం చినా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో శిల్ప మంగళవారం తానుంటున్న ఫ్లాట్‌లో ఉరివేసుకొని ఆత్మహ్యతకు పాల్పడింది. శిల్ప తండ్రి రాజగోపాల్‌ పీలేరులోని బరోడా బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తూ ఇటీవలే గుజరాత్‌కు బదిలీపై వెళ్లారు. తల్లి గృహిణి. చెల్లెలు శ్రుతి బెంగళూర్‌లో బీటెక్‌ చదివింది. ప్రాథమిక స్థాయి నుంచి శిల్ప బాగా చదివేది. ఎలాగైనా డాక్టర్‌ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అనుకున్నట్లుగా ఎంబీబీఎస్‌ సీటు సాధించింది.  వైద్యురాలైంది. భర్త రూపేష్‌కుమార్‌రెడ్డి మదనపల్లెలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో పనిచేసేవారు. రెండు సంవత్సరాల క్రితం పీలేరులోని చిత్తూరు మార్గంలో రుషి ఆర్ఢో అండ్‌ ట్రామా కేర్‌ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ డాక్టరు దంపతులకు నాలుగు సంవత్సాల కుమారుడున్నాడు. అనూహ్య రీతిలో  డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాం తికి గురయ్యారు.

ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదు...
వేధింపులకు భయపడకుండా ఎంతో ధైర్యంతో ప్రొఫెసర్లపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన శిల్ప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని బంధువులంటున్నారు. శిల్ప మృతిపై వీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వేధింపులకు గురిచేసిన ప్రొఫెసర్లను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు..
మృతురాలి సోదరి శ్రుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు ఇన్‌చార్జి సీఐ సిద్ధతేజమూర్తి, ఎస్‌ఐ పీవీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

నేడు విచారణ కమిటీ.
యూనివర్సిటీ క్యాంపస్‌: శిల్ప మృతితో వేసిన విచారణ కమిటీ బుధవారం కళాశాలలో విచారణ చేపట్టనుంది. కమిటీ విద్యార్థులను, అధ్యాపకులను, ఇతర అధికారులను రహస్యంగా విచారించనుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎవరూ భయపడవద్దని అధికారులు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top