డాక్టర్‌ కిడ్నాప్‌..రూ. 5 లక్షలు వసూలు | Doctor Kidnapped And Demands Five Lakhs in Karnataka | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ కిడ్నాప్‌..రూ. 5 లక్షలు వసూలు

Feb 23 2019 11:59 AM | Updated on Feb 23 2019 11:59 AM

Doctor Kidnapped And Demands Five Lakhs in Karnataka - Sakshi

కర్ణాటక, యశవంతపుర : అయుర్వేద డాక్టర్‌ను కారులో అపహరించి, చిత్రహింసలకు గురిచేసి అతని వద్ద నగదు, బంగారు ఉంగరాలు దోచుకెళ్లిన ఘటన అలస్యంగా వెలుగులోకి     వచ్చింది. వివరాలు...  అగ్రహర దాసరహళ్లికి చెందిన డాక్టర్‌ రవికుమార్‌ సుంకదకట్ట శ్రీనివాస నగరలో క్లినిక్‌ నడుపుతున్నారు. ఈ నెల 18న రాత్రి 10 గంటలకు విధులు ముగించుకోని బైక్‌లో వెళ్తుండగా మాగడి రోడ్డు కేహెచ్‌బీ కాలనీ అండర్‌పాస్‌ వద్ద అడ్డగించిన ముగ్గురు దుండగులు   చాకుతో బెదిరించి కారులో అపహరించారు. నిన్ను హత్య చేయడానికి మరో డాక్టర్‌ రూ. 5 లక్షల సుపారీ ఇచ్చాడని రవికి చెప్పారు. నీవు రూ. 6 లక్షలు ఇస్తే వదిలేస్తామని చెప్పడంతో తీవ్ర భయాందోళనకు గురైన రవికుమార్‌ తనకు తెలిసిన మరో డాక్టర్‌కు వారి నుంచి ఫోన్‌ చేయించి నగదు తీసుకురమ్మని చెప్పాడు.

దీంతో సదరు డాక్టర్, రవి కుమార్‌ ఇంటికి వెళ్లి విషయం వివరించి రవి సోదరి నుంచి రూ. 5 లక్షలు తీసుకుని కిడ్నాపర్లు చెప్పిన ప్రాంతానికి వచ్చి నగదు ముట్టజెప్పాడు. ఈ క్రమంలో డాక్టర్‌ రవికుమార్‌ సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడాన్ని కిడ్నాపర్లు పసిగట్టి రవి కుమార్‌ను తీవ్ర హెచ్చరించారు. అనంతరం దుండగులు రవిని నాగరబావి సర్కిల్లో దించి వెళ్లిపోయారు. తనకు పరిచయం ఉన్న వ్యక్తులే సుపారీ ఇచ్చి ఉంటారని రవికుమార్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కామాక్షిపాళ్య పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement