కిడ్నాప్‌కు గురైన దివ్యాంగుడు

Deaf And Dumb Boy Kidnaped And Reached Home After 9 Years - Sakshi

హోటల్‌లో పనిచేస్తున్నప్పుడు ఘటన

మందస : ఒకటి కాదు.. రెండు కాదు.. తొమ్మిదేళ్ల తర్వాత ఆ కుర్రాడు ఇంటికి చేరడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. మరణించాడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.

మందస పట్టణంలోని కంచమయికాలనీ సమీపంలో నివాసముంటున కరుమోజి సంతోష్‌ పుట్టుకతో దివ్యాంగుడు(మూగ, చెవిటి). సంతోష్‌ను ప్రతి ఒక్కరూ జడ్డిడుగా హేళన చేసేవారు. 9 ఏళ్ల కిందట ఇతడు పట్టణంలోని శ్రీవెంకటేశ్వర భోజన హోటల్‌లో పని చేసేవాడు. ఒక రోజు హఠాత్తుగా కనిపించలేదు.

ఇంటికీ వెళ్లలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు హోటల్‌ యాజమాన్యం కూడా సంతోష్‌ ఆచూకీకి ఎంతో ప్రయత్నించారు. ఇతడిపై పోలీసు స్టేషన్‌లో అదృశ్యం కేసు కూడా నమోదైంది. అయితే, అప్పటిలో ఓ చిరువ్యాపారి సంతోష్‌ను ఎవరో కారులో తీసుకెళ్లడం చూశానని చెప్పినప్పటికీ ఎవరూ నమ్మలేదు.

సంతోష్‌ కనిపించకుండా దాదాపు తొమ్మిదేళ్లు గడిచాయి. స్థానికంగా పానీపూరి చేసుకుని, అమ్ముకుంటూ జీవించే ఒడిశా వాసులు ఇదే కాలనీలో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం వారు తమ సొంత స్థలాలైన ఒడిశాలోని భువనేశ్వర్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లో సంతోష్‌ కనిపించాడు.

అతనితో సైగలతో మాట్లాడారు. తన దగ్గర డబ్బుల్లేవని, సొంత ఊరుకు వచ్చేస్తానని చెప్పడంతో వారు తమ చేతిలోని డబ్బులతో భువనేశ్వర్‌ నుంచి మందస తీసుకువచ్చి కుటుంబానికి సంతోష్‌ను అప్పగించారు. తొమ్మిదేళ్ల క్రితం ఆరోగ్యంగా ఉన్న ఇతడు ప్రస్తుతం చిక్కిపోయి ఉండడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు.

ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్‌.. ఏమి చేస్తున్నావ్‌.. అని ప్రశ్నించగా, తనను ఎవరో కారులో తీసుకెళ్లిపోయారని, ఇటుకలు తయారీ చేసే బట్టీలో కూలీగా మార్చేశారని సంతోష్‌ చెబుతున్నాడు. అర్థాకలితో యజమాని వేధింపులకు గురిచేశాడని, అంతేకాకుండా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పని చేయించుకునే వాడన్నాడు.

దాదాపుగా తప్పించుకుని పారిపోయే విధంగానే వచ్చానని చెబుతున్నాడు. సుమారు దశాబ్ద కాలం పాటు కనిపించకుండా పోయిన కుమారుడు ఇంటికి రావడంతో తల్లి కమల, అన్నయ్య అప్పన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, సంతోష్‌ లేకపోవడంతో రేషన్‌ కార్డులో పేరును తొలగించారని, ఆధార్‌కార్డు లేదని, వస్తున్న పింఛన్‌ను నిలిపివేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాము ఎంతో పేదరికంలో ఉన్నామని, అధికారులు స్పందించి, పింఛన్‌తో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top