అత్తను చంపిన కోడలు

Daughter In Law Killed Her Aunt For Assets In Prakasam - Sakshi

 తొలుత ఆత్మహత్య చేసుకుందని కోడలు ప్రచారం

పోలీసుల దర్యాప్తులో హత్యగా నిర్ధారణ

కోడలు గౌతం సంపూర్ణను అరెస్టు చేసిన పోలీసులు

వివరాలు వెల్లడించిన   ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు

ఒంగోలు క్రైం: అత్తను నిర్ధాక్షిణ్యంగా హతమార్చిన కోడలిని ఒంగోలు తాలూకా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు స్థానిక తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితురాలి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ఒంగోలు నగరం మర్రిచెట్ల కాలనీలో నివాసం ఉంటున్న గౌతం జయలక్ష్మి (55)ని కోడలు సంపూర్ణ హతమార్చిన కేసులో ఆమెను అరెస్టు చేశారు. అత్తా, కోడలు పక్కపక్క పోర్షన్లలో నివాసం ఉంటున్నారు. సంపూర్ణ మామ నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి అత్త జయలక్ష్మి తన ఆస్తులను ఆమె కుమార్తెకు రాస్తుందేమోనన్న అనుమానంతో ఆమెతో కొంతకాలంగా కోడలు గొడవపడుతోంది. ఏప్రిల్‌ 5వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో ఇద్దరూ గొడవ పడ్డారు.

ఈ నేపథ్యంలో అత్త జయలక్ష్మిని గట్టిగా నెట్టడంతో ఆమె తల గోడకు తగిలి కిందపడిపోయింది. తలకు గాయమైంది. విషయం బంధువులకు చెబుతుందోనని కోడలు భయపడింది. అత్త జయలక్ష్మి గొంతు గట్టిగా నొక్కింది. గొంతు నొక్కి ఊపిరాడకుండా చేయడంతో అత్త మృతి చెందింది. మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టి కోడలు సంపూర్ణ పెట్రోల్‌ పోసి తగులబెట్టింది. ఆ తర్వాత తన మామ చనిపోవడంతో అత్త జయలక్ష్మి మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేసింది. అప్పట్లో ఒంగోలు తాలూకా పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోడలు సంపూర్ణ ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమెపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించడంతో నేరం అంగీకరించింది. సంపూర్ణను అరెస్టు చేసి రిమాండ్‌ కోసం న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. అనుమానాస్పద కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేసిన తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ఎన్‌సీ ప్రసాద్, ఇతర సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top