కపటస్వామి బరితెగింపు

Dattatreya Avadhuta Swamy Marriage With Young Women in Kolaru - Sakshi

ఇటీవల యువతితో పరార్‌  

పెళ్లిచేసుకుని కొత్త రూపం  

యువతి బంధువులకు బెదిరింపులు

కర్ణాటక, కోలారు: తాలూకాలోని హొళలి గ్రామంలో 18 సంవత్సరాల యువతిని పెళ్లి చేసుకున్న 48 సంవత్సరాల దత్తాత్రేయ అవధూత స్వామి అలియాస్‌ రాఘవేంద్ర బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా పెళ్లాం, నా జోలికి వస్తే సుపారి కిల్లర్ల చేత చంపేయిస్తానని యువతి బావ ఎం.అరుణ్‌కుమార్‌ను కపటస్వామి బెదిరిస్తున్నాడు.  గత ఫిబ్రవరి 22న నిందితుడు యువతితో కలిసి పరారై తిరుపతిలో వివాహం చేసుకున్నాడు. ఘటనపై కోలారు రూరల్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇన్ని రోజులు తప్పించుకుని తిరుగుతున్న అతడు యువతితో పెళ్లి తరువాత స్వామీజీ గెటప్‌ తీసేసి మామూలుగా తయారయ్యాడు. 

మిమ్మల్ని లేపేస్తా..  
ఈ నేపథ్యంలో రాఘవేంద్ర యువతి బావ అరుణ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి తనపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తావా అని దూషించాడు. నేనిప్పుడు స్వామీజీ కాదని, పెళ్లి చేసుకున్నానని మా ఇద్దరి జోలికి వస్తే ఊరుకునేది లేదని  50 లక్షలు అయినా , కోటి రూపాయలు అయినా బెంగుళూరులో ఉన్న మా కుర్రాళ్లకు చెప్పి హత్య చేయిస్తానని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. కపట స్వామిజి బెదిరింపులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. యువతి అక్క తన చెల్లెలుతో మాట్లాడడానికి అవకాశం కల్పించాలని కోరినా అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం తన భార్యకు మీకు ఎలాంటి సంభంధం లేదని కపట స్వామి తేల్చి చెప్పాడు. వంచకుడు ప్రస్తుతం మురుడేశ్వరలో ఉన్నాడనే సమాచారంతో కోలారు పోలీసులు అక్కడకు వెళ్లారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top