దొంగతనం కేసులో పోలీసుల అమానుషం

Dalit Woman Tortured and Detained by Police In Rajasthan - Sakshi

సాక్షి, జైపూర్‌: దొంగతనం చేశారంటూ దళితులైన మరిది, వదినను అరెస్టు చేసిన కేసులో.. కస్టడీలో ఉన్న మరిది చనిపోవడం, పోలీసులు తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ వదిన వాంగ్మూలం ఇవ్వడం రాజస్థాన్‌లో సంచలనం రేపుతోంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీతో పాటు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, ఆరుగురు కానిస్టేబుళ్లను సస్సెండ్‌ చేసింది. అంతేకాక, జిల్లా అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌తో విచారణకు ఆదేశించింది. 

’రాజస్థాన్‌లోని చురు పోలీసులు దొంగతనం కేసులో నా తమ్ముడి(22)ని జూన్‌ 30న అనుమానితుడిగా తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న నా భార్య(35)ను తీసుకెళ్లారు. ఆ తర్వాత 6వ తేదీ రాత్రి నా తమ్ముడిని చిత్ర హింసలు పెట్టి చంపేశారు. ఈ ఘటనకు సాక్ష్యంగా ఉన్న నా భార్యపై సామూహికంగా అత్యాచారం చేసి, చేతి గోర్లను పీకేసి హింసించారు. ఎనిమిది రోజుల పాటు నా భార్యను అక్రమంగా నిర్బంధించి తమ్ముడు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత 10వ తేదీన విడిచిపెట్టారు’ అని మృతుని సోదరుడు మీడియాకు తెలిపారు. మృతుని సోదరి మాట్లాడుతూ.. 6వ తేదీన తన తమ్ముడిని గ్రామానికి తీసుకొచ్చి ఇదే నీ చివరి చూపని చెప్పారని విలపిస్తూ చెప్పింది. 8 రోజుల తర్వాత వచ్చిన వదిన ఆరోగ్య పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పింది.

ఈ దొంగతనం కేసులో మరిది, వదినలను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఎలాంటి చార్జిషీట్‌ దాఖలు చేయలేదని తమ దృష్టికి వచ్చిందని చురు జిల్లా అదనపు ఎస్పీ ప్రశాంత్‌ కుమార్‌ శర్మ వెల్లడించారు. మృతుని పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందనీ, మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చామన్నారు. సామూహిక అత్యాచారం కేసులో బాధిత మహిళ వాంగ్మూలం తీసుకున్నామనీ, ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతోందని క్రైమ్‌ బ్రాంచ్‌ అదనపు డీజీపీ బీఎల్‌ సోనీ పేర్కొన్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top