'కూలి'పోయారు

Daily Laborers Died In Lorry Accident Chittoor - Sakshi

కుప్పం ఘటనలో తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

అధిక లోడ్డు, కండీషన్‌ లేని లారీలో ప్రయాణమే కారణం

కన్నీరుమున్నీరైన వేలూరు

చనిపోయిన వారిలో పదో తరగతి విద్యార్థి

కూలీల జీవనం కూలిపోయింది. బతుకు కోసం పయనం కన్నీరే మిగిల్చింది. తమకు దిక్కెవరు దేవుడా..! అంటూ మృతుల కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. కుప్పం మండలం పెద్దవంక అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు ఆదివారం చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరారు. 22 మంది క్షతగాత్రులు ఆస్పత్రిపాలయ్యారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వానియంబాడి తాలూకా కల్‌నరసంబట్టు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కండీషన్‌ లేని లారీనే దీనికంతటికి కారణంగా తేలింది.

కుప్పం రూరల్, కుప్పం: పొట్టకూటి కోసం కూలి కొచ్చిన 9 మంది తమిళనాడు వాసులు.. శని వారం రాత్రి కుప్పం మండలం నాయనూరు పెద్దవంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే ఊరికి చెందడం, అందరూ బంధువులు కావడంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా నాట్రంపల్లె తాలూకా కల్లర్సంపట్టి గ్రామానికి చెందిన 31 మంది కూలీలు మామిడి కాయలు కోసేందుకు కుప్పం మండలం నాయనూరు గ్రామానికి శనివారం లారీలో వచ్చారు.

అదే గ్రామానికి చెందిన దిలీప్‌ కూలీలను పనుల కోసం నాయనూరుకు తరలించాడు. కాయలు కోసిన తరువాత ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యా రు. ఈ క్రమంలో పెద్దవంక సమీపంలోని అనపబావి మలుపు లోయలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి వాణియంబాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో 22 మంది గాయపడ్డారు. కాగా రాత్రికి రాత్రే మృతదేహాలను కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, నాట్రంపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు.

మృతులందరిదీ ఒకే గ్రామం..
కల్లర్సంపట్టి గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ కూలీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కో కుటుంబంలో ఒకరిద్దరు తప్పనిసరిగా కూలీపై ఆధారపడిన వారే. ఈ క్రమంలో మామిడి కాయలు కోసేందుకు ఆంధ్రాకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా కుప్పం వంద పడకల ఆస్పత్రి వద్దకు ఆదివారం మృతుల బంధువులు పెద్దఎత్తున చేరుకున్నారు. తమ వారి జాడకోసం అధికారులను వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

స్పందించిన జిల్లా అధికారగణం..
రోడ్డు ప్రమాదం సంఘటన సమాచారం తెలియడంతో ఆంధ్రా, తమిళనాడు అధికారులు వెంటనే  స్పందించారు. రాత్రికి రాత్రే జిల్లా కలెక్టర్‌ ప్రద్యు మ్న, ఎస్పీ రాజశేఖర్, డీఎస్పీ చౌడేశ్వరితో పాటు రెవెన్యూ శాఖ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అవసరమైన  ఏర్పాట్లు చేశారు. తమిళనాడు రాష్ట్రం వాణియంబాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం పంచనామా అనంతరం తమిళనాడు ప్రభుత్వ అంబులెన్స్‌లలో  మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top