ఆర్మీ ప్రొసీజర్‌ అంటూ.!

Cyber Criminals Cheating With Second Hand Vehicles Hyderabad - Sakshi

‘డబుల్‌ ఆఫర్‌’ ఇస్తున్న సైబర్‌ నేరగాళ్లు  

వైద్య విద్యార్థి నుంచి రూ.50 వేలు స్వాహా   

గిఫ్ట్‌ పేరుతో మరొకరికి రూ.57 వేలు టోకరా

సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసులు నమోదు

సాక్షి, సిటీబ్యూరో: ఆర్మీ అధికారుల మాదిరిగా సంప్రదింపులు జరుపుతూ, వివిధ యాడ్స్‌ యాప్స్‌లో పోస్టు చేసిన సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు/వస్తువుల ఖరీదు చేస్తామంటూ టోకరా వేసే సైబర్‌ నేరగాళ్లు తమ పంథా మార్చారు. వీరు కొత్తగా ఆర్మీ మిషనరీ ప్రొసీజర్‌ పేరుతో టోకరా వేస్తున్నారు. ఖరీదు చేసిన వస్తువుకు రేటు చెల్లించకుండా ఆ మొత్తం తమ ఖాతాల్లో వేయించుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా కేసుల సంఖ్య పెరిగిందని సైబర్‌ క్రైమ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ తరహాలో రూ.50 వేలు మోసపోయిన  ఓ వైద్య విద్యార్థి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదైంది. సదరు ఎంబీబీఎస్‌ స్టూడెంట్‌ తన వద్ద ఉన్న ఎక్సర్‌సైజ్‌ చైర్‌ విక్రయిస్తానంటూ ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు చేయగా, ఉత్తరాదికి చెందిన ఆర్మీ అధికారిగా అతడికి ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. బేరసారాల అనంతరం రూ.15 వేలకు దానిని కొనుగోలు చేస్తానని చెప్పాడు. అయితే ఆర్మీ మిషనరీ ప్రొసీజర్‌ ప్రకారం నేరుగా డబ్బు చెల్లించడం సాధ్యం కాదని అన్నాడు. అందుకు సమానమైన మొత్తాన్ని గూగుల్‌ పే ద్వారా తమకు పంపిస్తే... దానికి రెట్టింపు తమ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందని ఎర వేశాడు.

అదెలా సాధ్యమంటూ వైద్య విద్యార్థి ప్రశ్నించగా.. అనుమానం ఉంటే తొలుత రూ.5 పంపి పరీక్షించుకోవాలని చెప్పాడు. దీంతో ఆ విద్యార్థి ఆర్మీ అధికారి చెప్పిన ఫోన్‌ నంబర్‌కు రూ.5 పంపాడు. అప్పటికే రూ.10కి క్యూఆర్‌ కోడ్‌ సిద్ధం చేసి ఉంచిన సైబర్‌ నేరగాడు వెంటనే దాన్ని తిప్పి పంపాడు. అలా విద్యార్థి ఖాతాలోకి రూ.10 వచ్చి పడ్డాయి.  దీంతో అతడి మాటలు నిజమని నమ్మిన వైద్య విద్యార్థి రూ.15 వేలు గూగుల్‌ పే ద్వారా సైబర్‌ నేరగాడి ఫోన్‌కు పంపాడు. కొంత సేపు వేచి చూసినా డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితుడు అతడికి ఫోన్‌ చేశాడు. అయితే చిన్న సాంకేతిక సమస్య వచ్చిందని, మరో రూ.10 వేలు పంపితే మొత్తం రూ.40 వేలు ఖాతాలోకి వచ్చేస్తాయని నేరగాడు నమ్మబలికాడు. ఇలా ఇతడి నుంచి మొత్తం రూ.50 వేలు కాజేసిన సైబర్‌ నేరగాడు ఆపై స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరో ఉదంతంలో ముషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.57 వేలు కాజేశారు. ఇతడు కొన్నాళ్ల క్రితం ఆన్‌లైన్‌ ద్వారా విదేశాలకు చెందిన దావ్నే జాన్సన్‌ అనే సంస్థలో వాలంటీర్‌గా చేరాడు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌ గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. తమ సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఇస్తామంటూ అవతలి వ్యక్తులు చెబుతూ వచ్చారు. ఓ రోజు కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు సంస్థ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. సంస్థ తరఫున రూ.14 వేల విలువైన గిఫ్ట్‌ పంపిస్తున్నట్లు ఎర వేశారు. ఆపై కొరియర్‌ సంస్థ పేరుతో బాధితుడికి కాల్స్‌ వచ్చాయి. ఆ గిఫ్ట్‌కు సంబంధించిన తొలుత కొంత ట్యాక్స్‌ కట్టాలని, ఆపై మొత్తం రిఫండ్‌ వస్తుందని చెప్పారు. ఇలా బాధితుడి నుంచి రూ.57 వేలు తమ ఖాతాల్లో వేయించుకున్న సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top