
రేణుక, త్రినాథ్‌ల పెళ్లి ఫొటో, పెళ్లి చేసుకున్నట్లు రసీదు
అవును వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరని ప్రేమ వివాహానికి ఇరువురి పెద్దలు అడ్డుచెప్పారు..ఒకరినొకరు వీడలేక కులాంతర వివాహం చేసుకున్నారు. నాకు నువ్వు..నీకు నేను అనుకొని జీవితమంతా కలిసి ఉందామనుకున్నారు. తల్లిదండ్రులకు దూరంగా మరో జిల్లాకు పారిపోయారు. అద్దె ఇంటిలో ఆరు నెలలపాటు వారి జీవితం సజావుగా సాగింది. అంతలోనే ఏమైందో ఏమో..దంపతులిద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని మాయాబజార్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది.
గూడూరు : అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం కొడపగానిపల్లికి చెందిన బోయ సామాజిక వర్గీయుడు పూల కేశవ, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రేణుక (23) వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎంఎల్‌టీ చదివింది. ఈ క్రమంలో ధర్మవరం మండలం భిల్లుభూమయ్యపల్లికి చెందిన యాదవ సామాజిక వర్గీయుడు బాల ఈశ్వరయ్య కుమారుడు బాలత్రినాథ్ (25)తో రేణుకకు ప్రొద్దుటూరులో పరిచయమై అది పెళ్లి వరకూ వెళ్లింది. వారిద్దరూ గతేడాది అక్టోబరులో అక్కడ నుంచి వచ్చేసి నెల్లూరు నగరం సమీపంలోని నవబాల దుర్గాదేవి ఆలయంలో అదే నెల 8వ తేదీ ఉదయం 9.05 గంటలకు వివాహం చేసుకున్నారు.
అత్తింటి వేధింపులు?
శుక్రవారం రేణుక తల్లికి ఫోన్ చేసి తన బావకు, అత్తకు తమ పెళ్లి ఇష్టం లేదని, దీంతో వారు తరచూ ఫోన్ చేసి తనను వదిలేసి రావాలని త్రినాథ్‌కు చెబుతున్నారని బోరున విలపించిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. దీంతో రేణుక తల్లి రమణమ్మ, కుమార్తెకు సర్ది చెప్పింది. అయితే శనివారం ఉదయం రేణుక తల్లి మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో ఆందోళనకు గురయ్యారు.
అనుకున్నట్టే అయ్యింది!
ఏదైనా జరిగిందేమోనని రేణుక తల్లిదండ్రులు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరి సాయంత్రానికి గూడూరుకు చేరుకున్నారు. అప్పటికే నూతన దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉండటంతో ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో యజమానితోపాటు ఆ పరిసర ప్రాంతాల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా, త్రినాథ్ శవం దూలానికి వేలాడుతూ, కింద రేణుక శవం పాక్షికంగా వివస్త్రగా కన్పించింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో గానీ, రేణుక గొంతుకు చీర బిగించి ఉండటంతో, త్రినాథ్ ముందుగా రేణుక గొంతును చీరతో బిగించి చంపి, ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనని పోలీసులు అనుమానిస్తున్నారు.
రక్షణ కోరిన దంపతులు
నూతన దంపతులు గూడూరు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తాము కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నామని, ఈ వివాహం మా పెద్దలకు ఇష్టం లేదని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో పోలీసులు వారి పెద్దల ఫోన్ నంబర్లు తీసుకుని వారికి రేణుక, త్రినాథ్ ప్రేమ పెళ్లి విషయాన్ని తెలియజేశారు. వీరిద్దరూ గూడూరులోనే ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. రేణుక తల్లిదండ్రులు గూడూరులో ఉన్న తమ కుమార్తె వద్దకు వచ్చి వారిని తమ ఊరికి తీసుకెళ్లి బట్టలు పెట్టి తిరిగి పంపించారు. రేణుక గృహిణిగా ఇంట్లోనే ఉండగా, త్రినాథ్ మాత్రం వాషింగ్ మిషన్లు రిపేరు చేస్తూ భార్యాభర్తలు ఆనందంగా జీవిస్తున్నారు. అయితే వేరే కులం అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని సోదరుడు, తల్లి తరచూ తిడుతున్నారని, అమ్మాయిని వదలి వచ్చేయాలని అంటున్నారని త్రినాథ్ భార్య రేణుకతో చెబుతున్నాడని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
సమాచారం అందుకున్న డీఎస్పీ వీఎస్ రాంబాబు, గూడూరు రూరల్ సీఐ అక్కేశ్వరరావు, 1వ పట్టణ ఎస్సై శేఖర్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులను వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.