దోపిడీల దొరసాని

Columbia thieves in Bangalore - Sakshi

బెంగళూరులో కొలంబియా దొంగలు 

వరుస చోరీలతో పోలీసులకు సవాల్‌ 

ఎట్టకేలకు మహిళ, మరో నలుగురు అరెస్ట్‌ 

జయనగర: ఓ విదేశీ ముఠా హాలీవుడ్‌ సినిమా తరహాలో బెంగళూరులో ఇళ్లను కొల్లగొడుతూ చివరికి పోలీసులకు దొరికిపోయింది. దక్షిణ అమెరికాలోని కొలంబియాకి చెందిన ఓ మహిళ చాలాకాలం క్రితం టూరిజం వీసాపై భారత్‌కు వచ్చింది. దేశమంతటా పర్యటిస్తూ బెంగళూరుకు చేరుకుంది. ఇక్కడ విదేశీయులు అధికంగా ఉండడం, ధనిక నగరంగా పేరున్నట్లు గుర్తించిన మహిళ డబ్బు సంపాదించుకోవడానికి దొంగతనాలకు సిద్ధమైంది. తమ దేశానికి చెందిన మరో నలుగురితో కలసి ముఠాగా ఏర్పడి ఎవరికీ అనుమానం రాని రీతిలో హైటెక్‌ పద్ధతుల్లో చోరీలు చేయడం ప్రారంభించింది.

కారులో వచ్చి కాలింగ్‌బెల్‌ నొక్కి..
ముందుగా లక్ష్యంగా చేసుకున్న ఇంటి ముందు మహిళ ఖరీదైన కారులో దిగుతుంది. ఇంట్లో వ్యక్తులు తమకు పరిచయస్థులనే విధంగా ఇంటి గేటును తీసుకొని కాలింగ్‌బెల్‌ నొక్కుతుంది. అలా రెండుసార్లు మీట నొక్కిన అనంతరం ఎవరైనా తలుపు తీస్తే ఏదో చిరునామా కావాలంటూ చీటి చూపించి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది. ఒకవేళ పావు గంట వరకు ఎవరూ తలుపు తీయకపోతే ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని, కారులో ఎదురుచూస్తున్న ముఠా సభ్యులకు వాకీటాకీలో సంకేతాలు ఇస్తుంది.

అందరూ వచ్చి తలుపులు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి నగలు, నగదు దోచుకెళతారు. ఇలా హెచ్‌ఎస్‌ఆర్‌ లే అవుట్, బాణసవాడి, జయనగర్‌ ప్రాంతాల్లో ఆరు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. గతనెల 16న హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో నివాసముంటున్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్‌ ముఖర్జీ ఇంట్లోకి చొరబడిన ఈ ముఠా రూ.25 లక్షల విలువ చేసే నగలు, నగదు ఎత్తుకెళ్లింది. ఆ కేసు విచారణలో పోలీసులకు ఒక స్క్రూ డ్రైవర్‌ దొరికింది, అది విదేశాల్లో మాత్రమే లభ్యమవుతుంది, దానిని బట్టి ఈ చోరీ విదేశీయుల పనేనని ఖాకీలు తేల్చారు.

ఇలా దొరికారు.. 
గత నెల 22న జయనగర్‌ ఐదో క్రాస్‌ తొమ్మిదవ మెయిన్‌రోడ్‌లోని దుస్తుల వ్యాపారి రాజారాం ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి విదేశీ ముఠా బన్నేరుఘట్టలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు పసిగట్టి శుక్రవారం దాడి చేశారు. దొంగలు పారిపోవడానికి యత్నించగా పోలీసులు నిందితులపై పెప్పర్‌ స్ప్రే చల్లి పట్టుకున్నారు. విచారణలో వారు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న జయనగర్‌ పోలీసులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా నిందితులకు ఏడురోజుల రిమాండ్‌ విధించారు. నిందితులకు స్పానిష్‌ తప్ప మరో భాష రాదని తెలిపారు. నిందితుల పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top