చిన్నారిపై హత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష

Chittoor Sessions Court Death Sentence To Molestation Case Accused - Sakshi

‘పోక్సో’ చట్టం కింద రాష్ట్రంలో తొలి తీర్పు

చిత్తూరు జిల్లా అంగళ్లు పంచాయతీలో దారుణ కృత్యం 

పోక్సో కోర్టులో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు 

నిందితుడు అరెస్టయిన వంద రోజుల్లోనే విచారణ పూర్తి 

సంచలనాత్మక తీర్పునిచ్చిన న్యాయమూర్తి వెంకట హరినాథ్‌

చిత్తూరు అర్బన్‌: ఒకటో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని చిన్నారిపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. చిత్తూరు నగరంలోని పోక్సో (లైంగిక దాడుల నుంచి చిన్న పిల్లల పరిరక్షణ) న్యాయస్థానం పూర్తి అదనపు ఇన్‌చార్జి న్యాయమూర్తి,  మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి ఎం.వెంకట హరినాథ్‌ సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. రాష్ట్రంలో పోక్సో చట్టం కింద ఉరిశిక్ష ఇదే తొలిసారి కావడం గమనార్హం.  కేసు వివరాలను ప్రత్యేక అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వి.లోకనాథరెడ్డి, మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి విలేకరులకు వివరించారు.   చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఐదేళ్ల చిన్నారి గతేడాది నవంబర్‌ 7వ తేదీ రాత్రి కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీలో జరిగిన ఓ వివాహానికి తల్లిదండ్రులతో కలసి వచ్చింది. అందరూ భోజనాలు చేసిన తర్వాత ఆడుకుంటూ ఒంటరిగా కన్పించిన బాలికపై మదనపల్లెలోని బసినికొండకు చెందిన మహ్మద్‌ రఫీ (25) కన్ను పడింది.

లారీడ్రైవర్‌ అయిన రఫీ ఆమెకు ఐస్‌క్రీమ్‌ ఆశ చూపించి కల్యాణమండపంలో ఉన్న బాత్‌రూమ్‌కు తీసుకెళ్లాడు. పాప అరవకుండా గట్టిగా నోరు మూసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత చిన్నారనే కనికరం కూడా లేకుండా గొంతునులిమి చంపేశాడు. మృతదేహం కన్పించకుండా కల్యాణ మండపం పక్కన పడేసి వెళ్లిపోయాడు. రాత్రంతా పాప కోసం గాలించిన తల్లిదండ్రులు మరుసటిరోజు తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు కల్యాణ మండపం ప్రహరీ పక్కనున్న ఓ గుంతలో పాప మృతదేహం లభించింది.

అక్కడి సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీల ఆధారంగా నిందితుడి ఊహాచిత్రాన్ని రూపొందించి సమీప ప్రాంతాల్లోని ప్రజలను విచారించగా రఫీ ఘాతుకం బట్టబయలయ్యింది. ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పరారీలో ఉన్న రఫీని పట్టుకుంది. నవంబర్‌ 16వ తేదీన పోలీసులు అతన్ని అరెస్టు చేసి మదనపల్లె జూనియర్‌ మునిసిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచారు. రఫీ తన 15వ ఏటే ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడని, ఆ కేసుకు సంబంధించి కొన్నాళ్లు జువైనల్‌ హోమ్‌లో కూడా ఉన్నట్లు విచారణలో గుర్తించారు.  
వివరాలు వెల్లడిస్తున్న ఏపీపీ, డీఎస్పీ  

72 పేజీల తీర్పు... 
- న్యాయమూర్తి మొత్తం 72 పేజీలలో తన తీర్పు వెలువరించారు. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 5 (జే) (4) రెడ్‌విత్‌ సెక్షన్‌ 6 ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు.  
- మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్‌ 376–ఏ, 376–ఏబీ ప్రకారం, పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డందుకు పోక్సో చట్టం సెక్షన్‌ 5 (ఎం) రెడ్‌విత్‌ సెక్షన్‌ 6 ప్రకారం  జీవితఖైదు, రూ.1,000 జరిమానా విధించారు. 
- హత్యానేరానికి గానూ ఐపీసీ 302 ప్రకారం యావజ్జీవ కఠినకారాగార శిక్ష విధించారు.  
మృతదేహం దొరక్కుండా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినందుకు ఐపీసీ 201  ప్రకారం ఐదేళ్ల జైలుశిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. 
- ఈ దారుణ నేరానికి పాల్పడినందుకు తుదిగా ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. 

ప్రభుత్వం ప్రత్యేక చొరవ 
అప్పటికే తెలంగాణలో దిశ కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చిన్నారి హత్యకేసు విచారణ చిత్తూరులోని పోక్సో కోర్టులో నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లోకనాథరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు పోలీసులు 17 రోజుల్లోనే అన్ని సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానంలో నేరాభియోగపత్రాన్ని (చార్జిషీట్‌) దాఖలు చేశారు. గతేడాది డిసెంబర్‌ 12వ తేదీన విచారణ ప్రారంభించిన పోక్సో కోర్టు.. నిందితుడు అరెస్టయిన వంద రోజుల్లోనే విచారణ పూర్తిచేసి తీర్పునిచ్చింది.  

హేయమైన నేరం  
చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, హత్యచేయడం హేయమైన, నీచమైన నేరంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. రఫీని దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చారు. అంతేగాకుండా రూ.3 వేల జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 9 నెలల జైలు శిక్ష అనుభవించాలని 72 పేజీల తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. తీర్పు ప్రతులను హైకోర్టుకు పంపుతామని, ఉరిశిక్ష తేదీని హైకోర్టు ఖరారు చేస్తుందని న్యాయమూర్తి వెంకట హరినాథ్‌ తెలిపారు. తనపై భార్య, తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారని తీర్పుకు ముందు రఫీ వేడుకున్నా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు.  

పోక్సో చట్టం కింద మొదటి మరణ శిక్ష: హోం మంత్రి 
ఆంధ్రప్రదేశ్‌లో పోక్సో చట్టం కింద పడిన మొదటి మరణ శిక్ష ఇది అని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్‌ చేశారు. ‘చిత్తూరు సెషన్స్‌ కోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ఐదు సంవత్సరాల బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో అరెస్టయిన నిందితుడిని దోషిగా నిర్ధారించి మరణ శిక్ష విధించింది..’ అంటూ ట్వీట్‌ చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత 17 రోజుల్లోనే చార్జిషీట్‌ దాఖలు చేసి, నిందితుడికి ఉరి శిక్ష పడేలా చేయడంలో పోలీసులు చేసిన కృషిని ప్రశంసిస్తూ హోం మంత్రి మరో ట్వీట్‌ చేశారు. 

సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసులు పని చేశారు: డీజీపీ 
బాలికపై హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఒక ప్రకటనలో అభినందించారు. మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారికి త్వరగా శిక్షలు పడేలా చేయడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం కల్పించాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసులు పనిచేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ చట్టం అమలులోకి రావడానికి ముందే కేసు నమోదు, దర్యాప్తు, విచారణలో పోలీసులు తీసుకున్న చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. చిత్తూరు ఎస్పీ ఎస్‌.సెంథిల్‌కుమార్, ఎస్‌డీపీఓ కె.రవిమనోహరాచారి, పోలీస్‌ సిబ్బందిని డీజీపీ అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top