
ప్రమాదానికి కారణమైన స్కూల్ వ్యాన్ , శశ్వాంత్ మృతదేహం
సాక్షి, హుజూరాబాద్‌రూరల్: అమ్మఒడిలోంచి దిగి ఆ బాలుడు ఇప్పుడిప్పుడే నడవడం నేర్చుకుంటున్నాడు. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లిన అక్క తిరిగిరావడంతో సంబరంతో తీసుకురావడానికి తల్లితో వెళ్లాడు. ఇంతలోనే స్కూల్‌వ్యాన్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ బాలుడి ప్రాణం తీసింది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి స్కూల్‌వ్యాన్ టైర్లకింద పడి నలిగిపోయాడు. ఈ ఘటన హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామం లో శుక్రవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఎల్కపల్లి సంజీవ్– రాధికలకు కుమార్తె హర్షిణి, కొడుకు శశ్వాంత్(4)ఉన్నారు. హర్షిణి జమ్మికుంట పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఒకటోతరగతి చదువుతోంది. శుక్రవారం సాయంత్రం హర్షిణి దింపేందుకు స్యూల్‌వ్యాన్ వచ్చిది. కూతురును తీసుకెళ్లేందుకు రాధిక వస్తున్న క్రమంలో అమ్మ కొంగును పట్టుకొని శశ్వాంత్ వ్యాన్‌పుట్‌బోర్డు వరకు వచ్చాడు. హర్షిణి, రాధిక ఇంటికి వస్తుండగా శశ్వాంత్ పుట్‌బోర్డు వద్దనే ఉండిపోయాడు. గమనించని డ్రైవర్ వ్యాన్‌ను ముందుకు నడపడంతో శశ్వాంత్ టైర్లకిందపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గమనించిన రాధిక కొడుకు మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. టౌన్ సీఐ వాసంశెట్టి మాధవి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంజీవ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ తెలిపారు.