హంతకుడిని పట్టించిన కోడి ఈక

Chicken Feathers Help Thane Police Crack Murder Case - Sakshi

ముంబై : ఇతరులను విమర్శించడానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకడం వంటి అనే మాట వాడుతుంటాం. కానీ ఇదే కోడి ఈక మహారాష్ట్రలో ఓ మంచి పని చేసింది. ఓ హత్య కేసులో నిందితుడిని పట్టుకోవడానికి కోడి ఈక సాయం చేసింది. వివరాలు... గత నెల 23న కళ్యాణ్‌ పట్టణంలో ఓ హత్య జరిగింది. ఓ కల్వర్టు సమీపంలో సగం కాలిన స్థితిలో ఉన్న 25 ఏళ్ల యువతి మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించి.. ఆధారాల కోసం ఆ చుట్టుపక్కల వెతకసాగారు.

అక్కడ వారికి ఓ గోనేసంచిలో చిక్కుకున్న కోడి ఈక, ఓ తాయెత్తు కనిపించాయి. తాయెత్తు లోపల బెంగాలీ భాషలో ఏదో రాసి ఉంది. ఈ రెండింటి ఆధారంగా పోలీసులు ఆ ప్రాంతంలో బెంగాలీ తెలిసిన చికెన్‌ షాప్‌ ఓనర్‌, వర్కర్ల గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి ఆలం షేక్‌ అనే చికెన్‌ షాప్‌ ఓనర్‌ గురించి తెలిసింది. అతని గురించి ఆరా తీయగా.. సదరు యువతి మృతదేహం దొరికిన నాటి నుంచి అతడు కనిపించడం లేదని తెలిసింది. దాంతో థానే పోలీసులు ఆలమ్‌ స్వగ్రామం సైద్పూర్‌ వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో ఆలం తాను చేసిన నేరం ఒప్పుకున్నాడు. చనిపోయిన యువతి పేరు మోని అని.. గత కొద్ది నెలలుగా తామిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు చెప్పాడు. అయితే మోని అతని వద్ద నుంచి రూ. 2.50 లక్షలు అప్పు తీసుకుందని.. తిరిగి ఇవ్వడం లేదన్నాడు ఆలం. డబ్బు వసూలు చేయడం కోసం ఓ రోజు తన స్నేహితుడితో కలిసి మోని ఇంటికి వెళ్లాడు ఆలం. డబ్బు గురించి తమ మధ్య గొడవ జరిగినట్లు ఆ కోపంలో మోనిని తానే చంపేసినట్లు ఆలం ఒప్పుకున్నాడు. అనంతరం స్నేహితుడితో కలిసి మోని బాడీని బయటకు తీసుకువచ్చి గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి కాల్చినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆలం జైలులో ఉండగా అతడి స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top