సూత్రధారి డీఎఫ్‌వో.. పాత్రధారి ఎఫ్‌ఆర్‌వో

CBI Arrests Forest Officials Over Corruption - Sakshi

విధుల్లో సిబ్బందిని సరైన పద్ధతుల్లో నడిపించాల్సిన వారే.. కిందిస్థాయి ఉద్యోగిని కంచే చేను మేసిన చందంగా లంచం కోసం పీడించారు. జిల్లా బాస్‌ సూత్రధారిగా ఉండి... మరో అధికారిని పాత్రధారిగా మార్చి అవినీతికి పాల్పడుతూ.. ఏసీబీకి అడ్డంగా దొరికారు. అటవీశాఖలో కలకలం సృష్టించిన ఈ ఘటన గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. వెయ్యి కాదు రెండు వేలు కాదు ఏకంగా రూ.4లక్షల ముడుపుల కోసం వేధించడంతో పట్టించాడు.
– సిరిసిల్లక్రైం

సిరిసిల్లక్రైం: విధుల్లో సిబ్బందిని సరైన పద్ధతుల్లో నడిపించాల్సిన వారే.. కిందిస్థాయి ఉద్యోగిని కంచే చేను మేసిన చందంగా లంచం కోసం పీడించారు. జిల్లా బాస్‌ సూత్రధారిగా ఉండి... మరో అధికారిని పాత్రధారిగా మార్చి అవినీతికి పాల్పడుతూ.. ఏసీబీకి అడ్డంగా దొరికారు. అటవీ శాఖ లో కలకలం సృష్టించిన ఈ ఘటన గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. అటవీశాఖలో అవినీతి అధికారుల తీరును అదేశాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేసే ఉద్యోగి బట్టబయలు చేశాడు. వెయ్యి కాదు రెండు వేలు కాదు ఏకంగా రూ.4లక్షల ముడుపుల కోసం వేధించడంతో ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌ వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఫారెస్ట్‌ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్‌రావుతోపాటు సిరిసిల్ల ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ కె.అనిత అదే శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ వద్ద రూ.4లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

15శాతం వాటా ఇవ్వాలని వేధింపులు...
కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్లాన్‌టేషన్‌ పనులను జిల్లా అటవీశాఖ అధికారి.. ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌కు అప్పగించారు. పనులు ముగిసిన అనంతరం సుమారు రూ.45లక్షలు పనుల కింద శ్రీనివాస్‌కు బిల్లులు వచ్చాయి. దీంట్లో 15శాతం డీఎఫ్‌వోతోపాటు ఎఫ్‌ఆర్‌వోకు చెల్లించాలని సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ను కొద్దినెలలుగా డిమాండ్‌ చేస్తున్నారు. తాను చేసిన పనుల్లో ఆశించిన మేర లాభాలు రావడం లేదని, అడిగినంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడినా వినకపోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్రణాళిక ప్రకారం గురువారం రూ.4 లక్షలు ఇవ్వడానికి సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ సిరిసిల్ల అటవీశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఎఫ్‌ఆర్‌వో అనిత చాంబర్‌లో రూ.4లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారిగా ఉన్న డీఎఫ్‌వో శ్రీనివాస్‌రావుకు ఫోన్‌లో అనిత ద్వారా సమాచారం అందిస్తూ.. ‘రూ.4 లక్షలు వచ్చాయి’.. అనగానే అవతలి నుంచి డీఎఫ్‌వో.. ‘మీ వద్ద ఉంచండి తీసుకుంటాను.’ అనే మాటను వెల్లడించినట్లు ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌ తెలిపారు. దీంతో డీఎఫ్‌వో జగిత్యాలలో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సిరిసిల్లకు తీసుకువచ్చారు. డీఎఫ్‌వో శ్రీనివాస్‌రావు, ఎఫ్‌ఆర్‌వో అనితలపై కేసు నమోదు చేశారు. దాడుల్లో సీఐలు వేణుగోపాల్, రాములు, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

వేధింపులు తాళలేక..
అన్నం పెట్టిన శాఖలోనే వేధింపులు తాళలేకే ఏసీబీని ఆశ్రయించాను. చేసిన పనిలో లాభం రావడం లేదని, నెలల తరబడి బ్రతిమిలాడాను. అయినా అధికారులు కనికరం చూపలేదు. పట్టుబడిన అధికారులే కాదు వీరి పైన ఉన్న అధికారులు కూడా వేధించారు.
 – బాధిత సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top