బాలిక దారుణ హత్య

Brutal Murder Of A Girl In Thottambedu Panchayat - Sakshi

ఇప్పుడే వస్తానంటూ ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం

కాల్చిన స్థితిలో మృతదేహమై వెలుగులోకి

లైంగిక దాడి చేసి హత్య చేశారా?

వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు

ఇప్పుడే వస్తానంటూ ఇంటి నుంచి వెళ్లిన బాలిక దారుణ హత్యకు గురైంది. కాలిపోయిన స్థితిలో, ఒంటి మీద దుస్తులు లేకుండా డంపింగ్‌ యార్డులో ఆ బాలిక మృతదేహం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ ఇది సంచలనం సృష్టించింది. లైంగికదాడికి పాల్పడి హతమార్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సాక్షి, తొట్టంబేడు (చిత్తూరు) : తొట్టంబేడు పంచాయతీలోని క్రాస్‌ రోడ్డు పక్కన ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీచంద్ర, బూరీ దంపతులతో పాటు 20 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు పానీపూరీ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాయి. శ్రీచంద్ర దంపతులకు కుమారుడు రింకూ(18), కుమార్తె పింకీ(16) ఉన్నారు. తమ పిల్లల్ని ఇంటి వద్దే ఉంచి శ్రీచంద్ర తన భార్యతో కలిసి 10 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని తమ  స్వగ్రామమైన పహరీ విహార్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం తమ ఇంట రింకూ, పింకీ  పానీ పూరీ చేసే పనుల్లో పడ్డారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇప్పడే వస్తానంటూ తన అన్న రింకూకు చెప్పి పింకీ వెళ్లింది. సాయంకాలమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన రింకూ తమ బంధువులతో కలిసి పరిసర ప్రాంతాల్లో రాత్రంతా గాలించాడు.

శుక్రవారం ఉదయం స్థానికులు చిలకా మహాలక్ష్మి ఆలయం వెనుక వైపున ఉన్న డంపింగ్‌ యార్డులో కాలిపోయిన పింకీ మృతదేహాన్ని గుర్తించి దిగ్భ్రాంతి గురయ్యారు. సమాచారమివ్వడంతో టూటౌన్‌  సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, డీఎస్పీ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ దారుణ ఘటనను తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌కు డీఎస్పీ తెలియజేయడంతో ఆయన కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ పింకీ మృతదేహం నుంచి కొంతదూరం వెళ్లి గోదాము వద్ద ఆగిపోయింది. పోలీసులు మృతదేహానికి పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

మృతదేహంపై గాయాలు
పింకీ మృతదేహంపై గాయాలు ఉండడంతోపాటు, మృతదేహాన్ని కాల్చివేయడంతో లైంగికదాడి చేసి హతమార్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం  రాత్రి పింకీని ఆగంతకులు హత్యచేసి డంపింగ్‌ యార్డులో మృతదేహానికి నిప్పు పెట్టినట్లు ఆనవాళ్లు బట్టి తెలుస్తోంది. అయితే రాత్రి వర్షం కురవడంతో మృతదేహం పూర్తిగా కాలలేదు. ఇదలా ఉంచితే, పింకీ అందరితో కలివిడిగా ఉండేదని స్థానికులు చెప్పారు. పింకీ దారుణ హత్యకు గురవడంతో ఇక్కడ పానీపూరీ వ్యాపారం  చేసుకునే కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు కీలకం కానుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top