పెళ్లికి వచ్చిన విదేశీయులనూ వదల్లేదు! | Sakshi
Sakshi News home page

విదేశీయులనూ వదల్లేదు!

Published Tue, Jan 30 2018 9:48 AM

british woman complaint on indian constables - Sakshi

సాక్షి, గుంటూరు: రాజధాని జిల్లాలో నిత్యం, సభలు, సమావేశాల బందోబస్తుల నుంచి నేరస్తులు, దొంగల వేట వరకూ నిత్యం తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతూ కొందరు పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. అవినీతికి అలవాటుపడిన మరికొందరు ఆ శాఖ పరువును దిగజారుస్తున్నారు. విదేశీయుల రాకపోకలతో పాటు తీవ్రవాదుల కదలికలపై నిఘా ఉంచాల్సిన బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌(సి.ఐ) విభాగంలోని కానిస్టేబుళ్లే అవినీతికి తెర తీయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వీరు ఏకంగా విదేశీయుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో వారు డీజీపీ మాలకొండయ్యకు ఫిర్యాదు చేశారు.

ఆయన ఆదేశాలతో విచారణ నిర్వహించిన అర్బన్‌ ఎస్పీ విజయారావు అందుకు కారకులైన ముగ్గురు సీఐ సెల్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌చేసి నివేదికను డీజీపీకి పంపారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...గుంటూరు రూరల్‌ మండలం చౌడవరం గ్రామంలో గత ఏడాది డిసెంబర్‌ 20న జరిగిన ఓ స్నేహితుని వివాహానికి పలువురు విదేశీయులు హాజరయ్యారు. వారు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా వారి పాస్‌పోర్టులు పరిశీలించి నిబంధనల ప్రకారం ఫారం–సీ దరఖాస్తును వారి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారాన్ని కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌కు చెందిన కానిస్టేబుళ్లు చూడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎం. శ్రీనివాసకుమార్, టి.రవితేజ, వి.ప్రదీప్‌కుమార్‌ అనే ముగ్గురు కానిస్టేబుళ్లు విదేశీయుల వద్దకు వెళ్లి దురుసుగా ప్రవర్తించారని, డబ్బులు కూడా డిమాండ్‌ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతమంది ఒకేసారి ఎందుకు వచ్చారు.. పాస్‌పోర్టులు చూపించండి..అంటూ ఫొటోలు తీస్తూ హడావిడి సృష్టించారని, డబ్బులు కూడా డిమాండ్‌ చేసినట్టు సమాచారం.

అర్బన్‌ ఎస్పీ సమగ్ర విచారణ
పెళ్లి వేడుక ముగించుకుని స్వదేశానికి వెళ్లిన రోసియన్‌ రేన్యమ్‌ అనే బ్రిటిష్‌ మహిళ సీఐ సెల్‌ కానిస్టేబుళ్లు తమ పట్ల ప్రవర్తించిన తీరు, డబ్బులు వసూలు చేయడంపై ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ మాలకొండయ్యకు ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.  ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీపీ వెంటనే విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ సీహెచ్‌. విజయారావును ఆదేశించారు.
దీంతో సోమవారం సమగ్ర విచారణ జరిపిన అర్బన్‌ ఎస్పీ కానిస్టేబుళ్లు ఎం. శ్రీనివాసకుమార్, టి.రవితేజ, వి. ప్రదీప్‌కుమార్‌ విదేశీయుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు నిర్ధారించి వారిని సస్పెండ్‌ చేశారు. జరిగిన సంఘటనపై పూర్తి నివేదికను డీజీపీకి పంపారు. తాము విదేశీయుల వద్ద రూ.2వేలు వసూలు చేసిన మాట వాస్తవమేనని, అయితే ఫారం–సీ దరఖాస్తును పూర్తి చేసి ఇచ్చినందుకు కంప్యూటర్‌ సెంటర్‌ వాళ్లకు ఇవ్వమని డబ్బు ఇచ్చారంటూ సీఐ సెల్‌ కానిస్టేబుళ్లు ఎస్పీకి ఇచ్చిన వివరణలో తెలిపినట్టు సమాచారం.

Advertisement
Advertisement