‘పాలమూరు’ సొరంగంలో పేలుళ్లు

Blast In Palamuru Tunnel In Nagarkurnool - Sakshi

 ఇద్దరు కార్మికులు మృతి, మరో 15 మందికి  గాయాలు 

మృతులు, క్షతగాత్రులు అందరూ ఇతర రాష్ట్రాల వారే..

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎల్లూరు సమీపంలో ఘటన

సాక్షి, కొల్లాపూర్‌ : నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎల్లూరు సమీపంలో జరుగుతున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సొరంగం నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. టన్నెల్‌ తవ్వకం కోసం ఏర్పాటుచేసిన డైనమైట్లు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అకస్మాత్తుగా పేలాయి. సొరంగం లోపల 750 మీటర్ల వద్ద డైనమైట్లు్ల అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డైనమైట్లు అమరుస్తున్న కార్మికులతో పాటు సొరంగంలో పని చేస్తున్న 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్సకోసం తరలిస్తుండగా జార్ఖండ్‌కు చెందిన పాల్‌చంద్‌ (32), జయంత్‌(35) మృతి చెందారు. గాయపడిన వారికి నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అనంతరం హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, గాయపడిన వారిలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. 

కారణమేమిటి? 
సొరంగంలో డైనమైట్లు పేలడానికి స్పష్టమైన కారణాలు తెలియరావడం లేదు. పనులు జరుగుతున్న ప్రాంతంలో మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల కారణంగా డైనమైట్లను పేల్చే వైర్లకు కరెంట్‌ సరఫరా జరిగి పేలుళ్లు సంభవించినట్లుగా కాంట్రాక్టు పనులు చేస్తున్న నవయుగ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ ఎల్‌సీ నాయక్‌ పరిశీలించారు. ఈ ఘటనపై కాంట్రాక్టు కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు. కార్మికుల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాగర్‌ కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ క్షతగాత్రుల పరిస్థితిని పరిశీలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top