బైక్‌ దొంగల అరెస్ట్‌

Bikes Robbery Gang Arrest - Sakshi

12 మోటారు సైకిళ్లు స్వాధీనం

నిందితుల్లో ఇద్దరు సోదరులు..మరొకరు విద్యార్థి

కేసు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ

కోదాడ : గుంటూరు జిల్లాలో బైక్‌లను అపహరించి.. వాటిని కోదాడలో దాచిపెట్టి, విజయవాడలో విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. కేసు వివరాలను ఏఎస్పీ ఇస్మాయిల్‌ ఆదివారం సాయంత్రం కోదాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పాత నేరస్తుడు ధీకొండ వెంకటేశ్వర్లు ఆర్టీసీ అద్దె బస్సులో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. 2005లో దొంగతనం చేసి జైలుకి వెళ్లి వచ్చాడు. ఇతని తమ్ముడు ధీకొండ శ్రీకాంత్‌ కోదాడలో ఆర్టీసీ అద్దె బస్సులో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, సత్తెనపల్లి, రాజుపాలెం, మాచవరం, కారంపూడి, దుర్గి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 11 మోటారు సైకిళ్లను అపహరించాడు. వీటిని కోదాడలోని కట్టకొ మ్ముగూడెం రోడ్డులో ఉన్న తమ్ముడు శ్రీకాంత్‌ ఇంటిలో పెట్టాడు. వాటిలో ఒక దానిని  అమ్మడానికి విజయవాడ తీసుకెళుతుండడంతో వాహనాల తనిఖీ చేస్తున్న పట్టణ పోలీసులకు చిక్కారు. విచారించగా దొంగతనాల వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుంచి 11 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 5లక్షలకు పైగా ఉంటుందని ఆయన తెలిపారు.

మరో కేసులో...
గోదావరిఖనికి చెందిన అంటాల రాకేశ్‌ కోదాడలోని ఓ  పాలిటెక్నిక్‌ కళాశాలలో 2015–17 సంవత్సరంలో  డిప్లోమా ఇన్‌ మైనింగ్‌ కోర్సు చదివాడు. ఇతను కొన్ని సబ్జెక్టులు తప్పి గోదావరిఖనిలో ఉంటూ చెడు వ్యసనాల బారినపడ్డాడు. ఈ క్రమంలో తప్పిన సబ్జెకులను రాయడానికి ఇటీవల కోదాడకు వచ్చి శ్రీనివాసనగర్‌లోని తన స్నేహితుడి రూంలో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడిన రాకేశ్‌ ఈ నెల 2వ తేదీన శ్రీనివాసనగర్‌లో ఎండి సల్మాన్‌ ఇంటి ఎదుట పార్క్‌ చేసిన మోటార్‌ సైకిల్‌ను అపహరించాడు. శనివారం దాని నెంబర్‌ ప్లేటు తొలగించి విజయవాడలో అమ్మడానికి వెలుతూ ఖమ్మం రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు చిక్కాడు. విచారణలో దొంగతన విషయం బయటపడింది. దాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్య వహరించిన సిబ్బందిని ఆయన అభినందించారు.  సమావేశంలో కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, పట్టణ సీఐ శ్రీని వాసరెడ్డి, ఎస్‌ఐలు మహిపాల్‌రెడ్డి, నజీరుద్దీన్, సిబ్బంది మనోహర్, రామారావు, నర్సింహారావు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top