ఉన్నదంతా ఊడ్చేశారు!

Big House Robbery In Kurnool - Sakshi

సాక్షి, వెల్దుర్తి(కర్నూలు): తాళం వేసిన గృహాలే లక్ష్యంగా చేతివాటం ప్రదర్శిస్తున్న దొంగలు మండల కేంద్రమైన వెల్దుర్తిలో ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని తాళం పగుల గొట్టి దొరికిందంతా దోచుకెళ్లారు.   అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని 15 తులాల బంగారం, రూ.74వేల నగదు అపహరించుకెళ్లారు. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. వెల్దుర్తి  14వ వార్డులో నివాసం ఉంటున్న శ్రీధర్‌నాయుడు కిరాణం షాపు నిర్వహిస్తుండగా ఆయన భార్య ముంతాజ్‌ స్థానిక బీసీ బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా పని చేస్తున్నారు.      శనివారం ఉదయం ముంతాజ్‌ కాలి వేలికి గాయం కావడంతో చికిత్స నిమిత్తం దంపతులు ఇద్దరూ కర్నూలు వెళ్లారు.   రాత్రి ఆలస్యం కావడంతో బంధువుల ఇంట్లోనే బస చేశారు. అయితే ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో శ్రీధర్‌నాయుడి తల్లి లక్ష్మిదేవి అనుమానం వచ్చి లోపలకు వెళ్లి చూసింది.  

బీరువాలతోపాటు ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి  సమాచారం మేరకు ఇంటికి వచ్చిన శ్రీధర్‌ నాయుడు దంపతులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణగిరి ఎస్‌ఐ రామాంజనేయ రెడ్డి అక్కడకు వెళ్లి విచారణ చేపట్టారు.  అనంతరం డోన్‌ రూరల్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ మధుసూదన్‌రావు వచ్చి పరిశీలించారు. కర్నూలు నుంచి క్లూస్‌ టీం సీఐ శివారెడ్డి సిబ్బందితో వచ్చి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి కూడా గ్రామానికి వచ్చి పరిశీలించారు. ముందుగా 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.74వేల నగదు అపహరించుకెళ్లినట్లు అనుమానించినా 5 తులాల బంగారు గాజులు అక్కడే కనిపించాయి. ఇంటి గేటు బయట బంగారు చెవికమ్మ, బంగారు ముత్యాల దండ దొరికాయి. మొత్తంగా 15 తులాల బంగారు నగలు, రూ.74వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top