breaking news
veldhurthy
-
ఉన్నదంతా ఊడ్చేశారు!
సాక్షి, వెల్దుర్తి(కర్నూలు): తాళం వేసిన గృహాలే లక్ష్యంగా చేతివాటం ప్రదర్శిస్తున్న దొంగలు మండల కేంద్రమైన వెల్దుర్తిలో ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని తాళం పగుల గొట్టి దొరికిందంతా దోచుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని 15 తులాల బంగారం, రూ.74వేల నగదు అపహరించుకెళ్లారు. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. వెల్దుర్తి 14వ వార్డులో నివాసం ఉంటున్న శ్రీధర్‌నాయుడు కిరాణం షాపు నిర్వహిస్తుండగా ఆయన భార్య ముంతాజ్ స్థానిక బీసీ బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా పని చేస్తున్నారు. శనివారం ఉదయం ముంతాజ్ కాలి వేలికి గాయం కావడంతో చికిత్స నిమిత్తం దంపతులు ఇద్దరూ కర్నూలు వెళ్లారు. రాత్రి ఆలస్యం కావడంతో బంధువుల ఇంట్లోనే బస చేశారు. అయితే ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో శ్రీధర్‌నాయుడి తల్లి లక్ష్మిదేవి అనుమానం వచ్చి లోపలకు వెళ్లి చూసింది. బీరువాలతోపాటు ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి సమాచారం మేరకు ఇంటికి వచ్చిన శ్రీధర్ నాయుడు దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణగిరి ఎస్ఐ రామాంజనేయ రెడ్డి అక్కడకు వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం డోన్ రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి, రూరల్ ఎస్ఐ మధుసూదన్‌రావు వచ్చి పరిశీలించారు. కర్నూలు నుంచి క్లూస్ టీం సీఐ శివారెడ్డి సిబ్బందితో వచ్చి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి కూడా గ్రామానికి వచ్చి పరిశీలించారు. ముందుగా 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.74వేల నగదు అపహరించుకెళ్లినట్లు అనుమానించినా 5 తులాల బంగారు గాజులు అక్కడే కనిపించాయి. ఇంటి గేటు బయట బంగారు చెవికమ్మ, బంగారు ముత్యాల దండ దొరికాయి. మొత్తంగా 15 తులాల బంగారు నగలు, రూ.74వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. -
వేటగాళ్ల కోసం ముమ్మరంగా గాలింపు
వెల్దుర్తి: జింకలను వేటాడి అతి క్రూరంగా చంపిన వేటగాళ్ల కోసం గాలిస్తున్నామని డీఎఫ్ఓ శ్రీధర్‌రావు తెలిపారు. శనివారం మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో పలువురిని విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22న ఉదయం ఆటోలో వేటగాళ్లు జింకలను చంపి తీసుకెళ్తుండగా శెట్టిపల్లి వద్ద వీఎస్ఎస్ బాలయ్య గమనించి పట్టుకున్నాడని తెలిపారు. విషయం మా దృష్టికి తేగా తమ సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించి అడవిలోనే ఖననం చేశారన్నారు. ఒక మగ జింక, ఆడ జింకలకు పొట్టలు, గొంతులు కోశారని , రెండు పిల్ల జింకలకు సైతం గొంతులు కోశారని తెలిపారు. అనుమానితులైన ఇద్దరు తమ అదుపులో ఉన్నారని, జింకలను సరఫరా చేసే ఆటోను సీజ్ చేశామన్నారు. ఇదిలా ఉండగా గ్రామస్తులతోపాటు బాలయ్య మాట్లాడుతూ హైదరాబాద్ నుండి పిస్తోల్ కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రతి శనివారం సాయంత్రం సమయంలో శెట్టిపల్లి అడవిలోకి వచ్చి జంతువులను వేటాడుతుంటాడని డీఎఫ్‌ఓకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణ చేపడతామని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది అడవి జంతువులు వివిధ రకాల పంటలను ధ్వంసం చేశాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 10.50 లక్షలను రైతులకు పంట నష్ట పరిహారంగా అందచేశామన్నారు. పంటలు ధ్వంసమైతే 24 గంటలలోపు రైతులు తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎకరాకు పంటను బట్టి రూ. 6 నుండి రూ. 10వేల వరకు నష్ట పరిహారం అందజేస్తామన్నారు. ఆయన వెంట వైల్డ్‌లైఫ్ పోచారం అభయారణ్యం రేంజ్ అధికారి భర్నోబా, సిబ్బంది ఉన్నారు.