జాతరకు వెళ్లి ఉన్నా నువ్వు బతికే వాడివి కదరా!

Auto driver Died In Power Wires Curing - Sakshi

విద్యుదాఘాతంతో ఆటో డ్రైవర్‌ దుర్మరణం

‘ఒరే నాగేంద్ర.. నంద్యాలలో మీ అక్క చేసే జాతరకు వెళ్లి ఉన్నా నువ్వు బతికే వాడివి కదరా. దేవుడా.. మాకు ఎంత పెద్ద శిక్ష వేశావయ్యా. నిన్ననే పోరా అంటే మంగళవారం దినం బాగుంది ఇంటికి వాకిలి నిలిపి వెళ్తానమ్మా అని తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయావా నాయనా’ అంటూ తల్లి రోదించిన తీరు చూపరులను కలచివేసింది.  

గుత్తి రూరల్‌: నిర్మాణం జరుగుతున్న ఇంటికి నీటితో క్యూరింగ్‌ చేసే క్రమంలో విద్యుత్‌ తీగలు తగిలి ఆటో డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఊబిచెర్లకు చెందిన బోయ నాగేంద్ర (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఇంటిపై మరో ఇల్లు నిర్మాణం చేపట్టాడు. వాకిలి నిలిపి సిమెంట్‌ ప్లాస్టింగ్‌ చేయడంతో వాటి క్యూరింగ్‌కు మంగళవారం నీళ్లు పెడుతున్నాడు. పైన ఉన్న విద్యుత్‌ తీగలను గమనించక వాటిని తాకడంతో విద్యుదాఘాతానికి గురై మిద్దెపై నుంచి కిందకు పడ్డాడు. భార్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడిని వెంటనే గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే నాగేంద్ర మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీనాయకులపరామర్శ  
నాగేంద్ర మృతదేహాన్ని వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్‌ హుస్సేన్‌పీరా, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యయాదవ్, మండల కన్వీనర్‌ గోవర్ధన్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు రామరంగారెడ్డి, రామకృష్ణ, రామచంద్రలు ఆస్పత్రిలో సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top