కారు ఆపనందుకు కాల్చేశారు

Apple executive Vivek Tiwari murder - Sakshi

యాపిల్‌ సంస్థ మేనేజర్‌ను కాల్చిచంపిన యూపీ పోలీసులు

లక్నో: లక్నోలో దారుణం చోటుచేసుకుంది. యాపిల్‌ కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి శుక్రవారం అర్ధరాత్రి విధులు ముగించుకుని కారులో ఇంటికి వెళుతుండగా ఆయన్ను వెంబడించిన పోలీసులు కాల్చిచంపారు. యాపిల్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న వివేక్‌తివారీ(38) శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని మరో సహోద్యోగితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. ఇక్కడి ముకదమ్‌పూర్‌ వద్దకు రాగానే కారును ఆపాల్సిందిగా ఇద్దరు పోలీసులు సైగ చేశారు. వివేక్‌ కారును ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చారు. దీంతో ఆ కారును ఓవర్‌టేక్‌ చేసిన కానిస్టేబుల్‌ ప్రశాంత్‌ చౌధురి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ బుల్లెట్‌ వివేక్‌ ఎడమచెవి కింద దూసుకుపోవడంతో కారు డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. అనంతరం వివేక్‌ను ఇక్కడి లోహియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

ఆత్మరక్షణ కోసమే కాల్చాను: ప్రశాంత్‌
కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ ప్రశాంత్‌ మాట్లాడుతూ..‘శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ముకదమ్‌పూర్‌ వద్ద ఓ కారు లైట్లు ఆర్పేసి అనుమానాస్పదంగా ఆగి ఉండటాన్ని చూశా. నేను దగ్గరకు వెళ్లగానే వివేక్‌ ఒక్కసారిగా కారును నామీద నుంచి పోనిచ్చేందుకు యత్నించాడు. 3సార్లు ఇలా యత్నించాడు. దీంతో నా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాను’ అని తెలిపారు. కాగా, బుల్లెట్‌ కారణంగానే వివేక్‌ చనిపోయినట్లు తేలడంతో ఇద్దరు కానిస్టేబుళ్లపై ఐపీసీ సెక్షన్‌ 302(హత్య) కింద కేసు నమోదుచేశారు. సీఎం వచ్చి పరామర్శించేవరకూ వివేక్‌ అంత్యక్రియలు నిర్వహించబోనని భార్య తేల్చిచెప్పారు. సీబీఐ విచారణతో పాటు పోలీస్‌శాఖలో తన చదువుకు తగ్గ ఉద్యోగం, రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఘటనపై సీఎం యోగితో మాట్లాడిన హోంమంత్రి రాజ్‌నాథ్‌ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే సీబీఐ విచారణకు ఆదేశిస్తామని యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top