రోహిత్‌ తివారి హత్య కేసు; వీడియో కాల్‌ వల్లే ఇదంతా

Apoorva Shukla Murdered Husband Rohit Shekhar Over Quarreling About Video Call - Sakshi

వీడియో కాల్‌.. గ్లాసు మద్యం కారణంగా జీవితం తలకిందులు

భావోద్వేగాలు అదుపులో ఉంచుకోకపోవడం, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం, మితిమీరిన కోపం, అపార్థాలు అన్నీ వెరసి సుప్రీంకోర్టు న్యాయవాది అపూర్వ శుక్లా(35)ను హంతకురాలిగా మార్చాయి. తీరు మార్చుకోవాలని చెప్పినా వినకుండా నిండు జీవితాన్ని కోల్పోయాడు రోహిత్‌ తివారి(40). ఉన్నత విద్యావంతులై కూడా వైవాహిక బంధంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవడంలో విఫలమైన ఈ న్యాయవాద జంట తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పద్ధతి మార్చుకోక ఒకరు ప్రాణాలు కోల్పోతే.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో మరొకరు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకున్నారు.

ఆరేళ్ల పోరాటం అనంతరం ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి ఎన్డీ తివారే తన తండ్రి అని ప్రపంచానికి తనను తాను గర్వంగా పరిచయం చేసుకున్నాడు అపూర్వ భర్త రోహిత్‌ శేఖర్‌ . అనంతరం తల్లిదండ్రులకు పెళ్లి చేసి వారితో పాటు కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాలో రోహిత్‌ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ప్రస్తుతం అతడి హత్యకు సంబంధించిన వార్తలు కూడా అంతే సంచలనంగా మారాయి.

పరిచయం.. సహజీవనం
ఉజ్వల తివారి తన కుమారుడు రోహిత్‌ కోసం వధువును అన్వేషించడం మొదలు పెట్టిన కొన్నేళ్ల తర్వాత అతడు అపూర్వను కలుసుకున్నాడు. 2017లో ఓ మ్యాట్రిమొని వెబ్‌సైట్‌లో పరిచయమైన వీరిద్దరు అనతికాలంలోనే మంచి స్నేహితులయ్యారు. ఈ క్రమంలో అపూర్వను తల్లికి కూడా పరిచయం చేశాడు రోహిత్‌. వృత్తిరీత్యా న్యాయవాదులైన ఈ జంట దాదాపు ఏడాది పాటు సహజీవనం చేసింది. అనంతరం కొద్ది కాలం వేరుగా ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఇరువర్గాల కుటుంబ సభ్యులు అంగీకరించడంతో 2018, మే 12న ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్‌లో వైభవంగా పెళ్లిచేసుకున్నారు. న్యూఢిల్లీలోని డిఫెన్స్‌ కాలనీలో ఉన్న విలాసవంతమైన బంగ్లాలో కాపురం పెట్టారు.

ఆమె ఎవరు?
కుమారుడు ఓ ఇంటివాడయ్యాడనే సంతోషం ఉజ్వలా తివారీకి ఎంతోకాలం నిలవలేదు. పెళ్లైన రెండో రోజు నుంచే రోహిత్‌- అపూర్వల మధ్య గొడవలు మొదలయ్యాయి. తన భర్తకు వేరే మహిళతో సంబంధం ఉందనేది అపూర్వ ఆరోపణ. అంతేకాదు ఆమె రోహిత్‌కు సమీప బంధువు కావడంతో అపూర్వ అనుమానం మరింత బలపడింది. తరచుగా తమ ఇంటికి రావడం, తన భర్తతో చనువుగా ఉండటం భరించలేకపోయేది. ఈ క్రమంలోనే పద్ధతి మార్చుకోవాలని భర్తను పదే పదే హెచ్చరించింది. అయితే ఆమె కేవలం స్నేహితురాలు మాత్రమేనని రోహిత్‌ చెప్పడంతో ఏమీ చేయలేకపోయేది.

రోహిత్‌ తీరుతో అభద్రతా భావానికి లోనైన అపూర్వ తాను, తన తల్లిదండ్రులు ఉండేందుకు విలాసవంతమైన భవనం కట్టించాలంటూ భర్తను డిమాండ్‌ చేయడం మొదలుపెట్టింది. అయితే రోహిత్‌ మాత్రం ఆమె మాటలను ఏనాడు లెక్కచేయలేదు. దీంతో తరచుగా ఇద్దరూ వాదులాడుకునేవారు. ఈ క్రమంలోనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు.

చదవండి : అపూర్వను గుడ్డిగా నమ్మాను

ఆ వీడియో కాల్‌ వల్లే ఇదంతా..
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్‌ 11న ఓటు వేసేందుకు రోహిత్‌ తన తల్లితో కలిసి ఉత్తరాఖండ్‌కు బయల్దేరాడు. అపూర్వ మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయింది. అయితే ఉత్తరాఖండ్‌లో ఉన్న సమయంలో రోహిత్‌ బంధువు, అపూర్వ అనుమానాలకు కారణమైన సదరు మహిళ ఉజ్వల, రోహిత్‌లతో పాటే ఉంది. ఓ రోజు కారులో వీరిద్దరు మాత్రమే ప్రయాణిస్తూ మద్యం తాగారు. అప్పుడే అపూర్వ అతడికి వీడియోకాల్‌ చేసింది. మత్తులో ఉన్న రోహిత్‌ వెంటనే కాల్‌ లిఫ్ట్‌ చేశాడు. ‘ఆమె’ గురించి అడుగగా.. కవర్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అపూర్వ మాత్రం రోహిత్‌ అబద్ధం చెబుతున్న విషయాన్ని పసిగట్టింది.

ఆరోజు ఏం జరిగిందంటే..?
ఏప్రిల్‌ 15 రాత్రి పది గంటల సమయంలో రోహిత్‌ డిఫెన్స్‌ కాలనీలో గల తన ఇంటికి చేరుకున్నాడు. అయితే అతడితో ‘ఆమె’ కూడా రావడాన్ని అపూర్వ తట్టుకోలేకపోయింది. కోపాన్ని అదుపుచేసుకొని అతడికి భోజనం వడ్డించింది. అనంతరం ఆమె వెళ్లిపోగా.. ఉజ్వల కొడుకు, కోడలును హాల్లోకి పిలిచి కాసేపు మాట్లాడుకోమని సూచించి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రయాణం కారణంగా అలసిపోయానని చెప్పిన రోహిత్‌ బెడ్‌రూంలో నిద్రపోగా.. అపూర్వ మాత్రం 12.45 వరకు టీవీ చూసింది. అనంతరం బెడ్‌రూంలోకి వెళ్లి ‘ఆమె’ గురించి ప్రశ్నించింది. తామిద్దరం కలిసి కారులో ఒకే గ్లాసులో మందు తాగామని.. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ రోహిత్‌ బదులిచ్చాడు. దీంతో కోపోద్రిక్తురాలైన అపూర్వ దిండుతో అతడికి ఊపిరాడకుండా చేసింది. మద్యం మత్తులో ఉండటంతో ఆమెను ప్రతిఘటించలేక రోహిత్‌ ప్రాణాలు కోల్పోయాడు.

చదవండి : నా ఇద్దరు కొడుకుల ఆస్తిపై కన్నేసింది : ఎన్డీ తివారి భార్య

ఈ విషయం గురించి రోహిత్‌ హత్య కేసును విచారించిన ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ... ‘ భర్తను హత్యచేసిన తర్వాత అపూర్వకు ఏం చేయాలో అర్థం కాలేదు. అర్ధరాత్రి 2 గంటల వరకు ఆమె నిద్రపోలేదు. ఆ తర్వాత హత్యకు సంబంధించిన ఆధారాలన్నీ మాయం చేసింది. రోహిత్‌ను నిద్రలేపేందుకు పనిమనిషి బోలు ప్రయత్నించగా అతడిని వారించింది. అనంతరం తిలక్‌ లేన్‌లో నివసించే ఉజ్వల తివారి రాగా.. రోహిత్‌ను డిస్ట్రర్బ్‌ చేయొద్దని చెప్పింది. ఆ తర్వాత ఆమె వెళ్లిపోవడం, రోహిత్‌కు గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో చేర్పించడం జరిగాయి. అనేక పరిణామాల అనంతరం రోహిత్‌ను హత్య చేసింది తానేనంటూ అపూర్వ నేరాన్ని అంగీకరించారు’అని కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

-సుష్మారెడ్డి యాళ్ల

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top