నగరం నడిబొడ్డున 3గంటలపాటు గ్యాంగ్‌ రేప్‌

another brutal incident :  Bhopal Student Gang-Raped For 3 Hours - Sakshi

భోపాల్‌లో ఐఏఎస్‌ విద్యార్థినిపై మృగాళ్ల పాశవికం

దారుణ ఘటనను ‘సినిమా కథ’గా కొట్టిపారేసిన పోలీసులు..

అదే స్పాట్‌లో నిందితులను గుర్తించి, గల్లాపట్టి లాక్కొచ్చిన బాధితురాలు

విపక్షాల ఆందోళన.. సీఎం చౌహాన్‌ సీరియస్‌

భోపాల్‌ : నగరం అడవిగా మారింది. కొన్ని క్రూరమృగాళ్లు కలిసి ఓ ఆడబిడ్డను వేటాడి, మూడు గంటలపాటు పీక్కుతిన్నాయి. నెత్తురుకారుతున్న తనవుతో.. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే ‘సినిమా కథలు చెబుతున్నావా?’ అని వెటకారాలు ఎదురయ్యాయి. చివరికి బాధితురాలే కీచకులను గుర్తించి, గల్లాపట్టి లాక్కొస్తేగానీ కేసు నమోదుకాలేదు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నగరం నడిబొడ్డున చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

ఐఏఎస్‌ కోచింగ్‌కు వెళ్లొస్తూ : భోపాల్‌ శివారు గ్రామంలో నివసించే ఓ యువతి ఐఏఎస్‌ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటోంది. ప్రతిరోజూ భోపాల్‌ నడిబొడ్డులోని హబీబ్‌ గంజ్‌ రైల్వే స్టేషన్‌ ద్వారా రాకపోకలు సాగించేంది. గురువారం సాయంత్రం.. కోచింగ్‌ సెంటర్‌ నుంచి రైల్వేష్టేషన్‌కు షార్ట్‌ కట్‌ రూట్‌లో వెళుతోన్న ఆమెను ఇద్దరు తాగుబోతులు అటకాయించారు. బలవంతంగా చేతులు, కాళ్లు కట్టేసి, పక్కనున్న కల్వర్టు దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ చోటు నుంచి హబీబ్‌గంజ్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు దూరం కేవలం 100 మీటర్లు మాత్రమే!!

దుస్తులు ఇమ్మంటే ఇంకో ఇద్దరిని తీసుకొచ్చారు : మధ్యమధ్యలో సిగరెట్‌, తంబాకు కోసం విరామం ఇస్తూ గంటలపాటు యువతిపై అత్యాచారం చేశారు. దుస్తులు పూర్తిగా చినిగిపోవడంతో వేసుకోవడానికి ఏవైనా ఇమ్మని బాధితురాలు వేడుకుంది. నిందితుల్లో ఒకడు ఇప్పుడే వస్తానని వెళ్లి, దుస్తులతోపాటు మరో ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చాడు. నలుగురూ కలిసి ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారు. ఆమె దగ్గరున్న ఫోన్‌, వాచ్‌, పర్స్‌లను గుంజుకొని, చివరికి రాత్రి 10 గంటల తర్వాత విడిచిపెట్టారు.

సినిమా కథలు చెబుతున్నావా? : నడవలేని స్థితిలో ఎలాగోలా రైల్వే స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు.. తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది. ఆ రాత్రే.. తల్లిదండ్రులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే స్టేషన్‌ ఇన్‌చార్జి.. బాధితులు చెప్పిన కథనాన్ని నమ్మలేదు. పైగా, ‘సినిమా కథలు చెబుతున్నారా?’ అని ఎద్దేవా చేశాడు.

అదే స్పాట్‌లో మళ్లీ కనిపించారు : తెల్లవారిన తర్వాత బాధితురాలు, ఆమె తండ్రి అసహాయ స్థితిలో పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటికొచ్చిన హబీబ్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌ వైపునకు కదిలారు. సరిగ్గా అత్యాచారం జరిగిన ప్రదేశంలో.. తనను చెరబట్టిన ఇద్దరు కూర్చొని ఉండటం గమనించిందా యువతి. తండ్రి సహాయంతో ఆ ఇద్దరినీ తన్ని, గల్లాపట్టుకొని ఈడ్చుకొచ్చి పోలీస్‌ స్టేషన్‌లో పడేసింది. ఇక పోలీసులు కేసు నమోదుచేయక తప్పనిసరైంది. నిందితులను గొలూ బిహారీ, అమర్‌ భుటూలుగా గుర్తించారు.

విపక్షాల ఆందోళన.. సీఎం సీరియస్‌ : హబీబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద గ్యాంగ్‌ రేప్‌, పోలీసుల అలసత్వంలపై విపక్ష కాంగ్రెస్‌ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణ చర్యగా ఫిర్యాదు నమోదు చేయడంలో అలసత్వం వహించిన పోలీస్‌ అధికారులను సస్సెండ్‌ చేశారు. బాధితురాలు అప్పగించిన ఇద్దరు నిందితుల ద్వారా మరో ఇద్దరిని పట్టుకున్నారు. మొత్తం నలుగురిపైనా నిర్భయ, తదితర చట్టాలకింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇద్దరూ భద్రతాదళ ఉద్యోగులే కావడం గమనార్హం. జాతీయ మహిళా కమిషన్‌ సైతం భోపాల్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై స్పందించింది. కేసు వివరాలు పంపాల్సిందిగా మధ్యప్రదేశ్‌ డీజీపీకి శుక్రవారం ఒక లేఖ రాసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top