ఇస్రో శాస్త్రవేత్త హత్య కేసు; వీడిన మిస్టరీ

Anjani Kumar Press Meet Over Scientist Sridharan Suresh Murder Case - Sakshi

హత్య కేసు వివరాలు వెల్లడించిన సీపీ అంజనీ కుమార్‌

సాక్షి, హైదరాబాద్ : శాస్త్రవేత్త శ్రీధరన్‌ సురేష్‌ హత్య కేసు మిస్టరీని ఛేదించినట్లు నగర సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. సురేష్‌తో అనైతిక సంబంధం ఏర్పరచుకున్న శ్రీనివాస్‌ డబ్బు కోసమే అతడిని హతమార్చినట్లు వెల్లడించారు. బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో సైంటిస్ట్‌గా పరిచేస్తున్న శ్రీధరన్‌ తన ఫ్లాట్‌లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన సీపీ కేసుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. సురేష్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించకపోవడంతో భార్య ఇందిరా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఎస్సార్‌ నగర్ పోలీసులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. సీపీ మాట్లాడుతూ.. ‘ఈ నెల 1న అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లోని తన గదిలో సురేష్‌ హత్యకు గురయ్యాడు. అతడి భార్య ఫిర్యాదు మేరకు సురేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు.. గదికి బయట నుంచి తాళం వేసి ఉండటంతో.. లాక్ పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న సురేష్‌ను గుర్తించారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజ్, సురేష్ కాల్ డేటా, వేలిముద్రలను సేకరించారు’ అని తెలిపారు.

ఈ ఆధారాలతో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు.. తరచుగా శ్రీనివాస్ అనే వ్యక్తి సురేష్ ఇంటికి వస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు. లాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. ‘సురేష్ తరచూ బ్లడ్‌టెస్టు కోసం విజయ డయాగ్నస్టిక్స్‌కు వెళ్లేవాడు. అక్కడే లాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. భార్యకు దూరంగా... ఒంటరిగా ఉంటున్న సురేష్‌తో శ్రీనివాస్ అనైతిక సంబంధం ఏర్పచుకున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల నుంచి డబ్బులు కావాలని శ్రీనివాస్ సురేష్‌ను అడుగుతూ వచ్చాడు. సురేష్ ఇందుకు స్పందించకపోవడంతో అతడిని హత్య చేయాలని శ్రీనివాస్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా సురేష్ గదికి వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో సురేష్‌ను హత్య చేశాడు’ అని సీపీ వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి ఒక కత్తి, రెండు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top