ప్రదీప్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

Anchor pradeep driving licence cancelled for 3 years - Sakshi

మద్యం తాగి వాహనం నడిపిన కేసులో నాంపల్లి కోర్టు తీర్పు

లైసెన్స్‌ మూడేళ్లు రద్దు.. రూ.2,100 జరిమానా

జనాలను తాగొద్దని.. మీరు మాత్రం తాగుతారా?

ప్రదీప్‌ను నిలదీసిన న్యాయమూర్తి 

 తప్పు అంగీకరించిన ప్రదీప్‌

డ్రైవర్‌ రాకపోవడంతో నడిపానని వివరణ 

 మళ్లీ ఇలా చేయబోనని విన్నపం

సాక్షి, హైదరాబాద్‌: మద్యం తాగి వాహనం నడిపిన కేసులో టీవీ యాంకర్‌ మాచిరాజు ప్రదీప్‌కు కోర్టు గట్టి షాకిచ్చింది. ఆయన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేసింది. రూ.2,100 జరిమానా విధించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 31న అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగిన ప్రదీప్‌.. అనంతరం కారు నడుపుతూ జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌ తనిఖీల్లో పట్టుబడిన విషయం తెలిసిందే. బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో ఆయన ‘బ్లడ్‌ ఆల్కాహాల్‌ కౌంట్‌ (బీఏసీ) ఏకంగా 178 పాయింట్లుగా నమోదైంది. దీంతో ఆయన కారును సీజ్‌ చేసిన పోలీసులు.. ప్రదీప్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు నిర్వహించే కౌన్సెలింగ్‌కు ప్రదీప్‌ హాజరుకావాల్సి ఉన్నా.. కొద్ది రోజులపాటు కనబడకుండా పోయారు. అయితే ముందే నిర్ణయమైన మేరకు షూటింగులలో పాల్గొనాల్సి వచ్చిందని.. పోలీసులు, కోర్టుల ఆదేశాల మేరకు నడుచుకుంటానని ఒక వీడియో విడుదల చేశారు. తర్వాత ఈ నెల 8న గోషామహల్‌లోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో పోలీసుల కౌన్సెలింగ్‌కు తన తండ్రితో కలసి హాజరయ్యారు. తాజాగా శుక్రవారం కోర్టులో విచారణకు హాజరయ్యారు. 

తప్పు అంగీకరించిన ప్రదీప్‌ 
శుక్రవారం ఉదయం సాధారణ డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులను విచారించిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి.. 150 పాయింట్లకన్నా ఎక్కువ బీఏసీ నమోదైన కేసులను మధ్యాహ్నం విచారించారు. దీంతో ప్రదీప్‌ సుమారు రెండు గంటల సమయంలో కోర్టుకు వచ్చారు. కోర్టు హాల్‌లోకి వెళ్లగానే న్యాయమూర్తికి నమస్కారం చేశారు. మీ పేరు, తండ్రి పేరు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ప్రదీప్‌ సమాధానాలు చెప్పారు. ‘‘మద్యం తాగి కారు నడిపారా, మీకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా?’’అని న్యాయమూర్తి అడగగా.. ప్రదీప్‌ ‘‘నాకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంది. మద్యం తాగి కారు నడిపాను..’’అని అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ... ‘‘మీరు మద్యం తాగి వాహనాలు నడపవద్దని ప్రచారం చేశారని చెబుతున్నారు.. మీరే మద్యం తాగి కారు నడపడం ఏమిటి..?’’అని ప్రశ్నించారు. దీంతో ప్రదీప్‌ న్యాయమూర్తికి నమస్కరిస్తూ.. ‘‘తప్పు జరిగింది. మళ్లీ ఇలాంటి తప్పు చేయను. నా కారుకు డ్రైవర్‌ ఉన్నారు. కానీ ఘటన జరిగిన రోజున డ్రైవర్‌ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేనే కారు నడపాల్సి వచ్చింది..’’అని వివరణ ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ప్రదీప్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను మూడేళ్లపాటు రద్దు చేయడంతోపాటు రూ.2,100 జరిమానా విధించారు. 

మళ్లీ తప్పు చేయను: ప్రదీప్‌
కోర్టు నుంచి బయటకు వచ్చిన ప్రదీప్‌ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసుల కౌన్సెలింగ్‌ తర్వాత కోర్టుకు హాజరుకావాలని ఆదేశించడంతో కోర్టుకు వచ్చాను. న్యాయవాదిని పెట్టుకోలేదు. న్యాయమూర్తి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నాను. మద్యం తాగి వాహనం నడిపానని న్యాయమూర్తి ముందు ఒప్పుకున్నాను. మళ్లీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటా..’’అని పేర్కొన్నారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top