దూకుడు పెంచిన ఏసీబీ

ACB Special Offers Attack On Govt Office Warangal - Sakshi

వరంగల్‌ క్రైం: ప్రభుత్వం వేల రూపాయల వేతనాలు పెంచినా.. కొంత మంది అధికారుల వక్ర బుద్ధి మారడం లేదు. ప్రజలను లంచం పేరుతో జలగల్లా పీక్కుతుంటున్నారు. పైసలు ఇవ్వందే ఫైళ్లు కదలటం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది అవినీతి అధికారుల వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఉచితంగా..స్వచ్ఛందంగా చేయాల్సిన పనులకు  పర్సంటేజీలు   కట్టి వాటిని వసూల్‌ చేసేందుకు నిబంధనలున అడ్డుగా పెట్టి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూన్నారు.

పచ్చ నోట్లు చేతుల్లో పెడితే ఫైళ్లకు రెక్కలు వస్తున్నాయి. కాసుల కక్కుర్తికి నిబంధనలకు నీళ్లు ఒదులుతున్నారు. ప్రతినిత్యం అందిన కాడికి దోచేద్దాం అనే ఆలోచనలో కొంత మంది అధికారులు కార్యాలయాలకు వస్తున్నారు. ఇలాంటి దృష్యాలు ప్రతీ సర్కారు ఆఫీసుల్లో  దర్శనం ఇస్తున్నాయి. అక్రమ సంపాదన కోసం ప్రజలను పీక్కుతుంటున్న అవినీతి అధికారుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ ఇటీవల దూకుడు పెంచింది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు కాదు...రాకెట్లు పరుగిడుతున్నాయి.  ఏసీబీ వల్ల కొంత మంది అధికారులైన స్వచ్ఛందంగా పనులు చేయటానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల ఏసీబీ పెంచిన దూకుడుకు అవినీతి చేపలు ఒక్కొక్కటిగా వలలో చిక్కుతున్నాయి. గత ఏడాది జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అ«ధికారులు 12 కేసులు నమోదు చేయగా ఈ సంవత్సరం ఒక నెలల్లోనే మూడు కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించారు.

గత ఏడాది 12 కేసులు నమోదు..
2018 సంవత్సరంలో ఏసీబీ అధికారులు అక్రమాస్తులు, లంచం పుచ్చుకున్న అధికారులపై 12 కేసులు నమోదు చేశారు. మునిసిపాలిటీ డీఈ పాటి కొండల్‌రావు ఆదాయంకు మించి ఆస్తులు ఉన్నాయనే కారణంతో అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. మహబుబాబాద్‌ టౌన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ముత్తె కమలాకర్‌ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్‌ఎస్‌ఏ ఈఈ రవీందర్‌రావు కాంట్రాక్టర్‌ నుంచి రూ.3 లక్షల లంచం తీసుకుని పట్టుబడ్డాడు. నర్సంపేట నగరపంచాయతీ ఆర్‌ఐ మెరుగు మురళి రూ.10 వేలు లంచం తీసుకోని ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. భూపాల్‌పల్లి ఆర్డీఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ పిండి శ్రీనివాస్‌ రూ.50 వేలు లంచం తీసుకుని పట్టుబడ్డాడు.

జనగామ జిల్లా చిల్పూరుగుట్ట దేవస్థానం ఈవో చెరుకు జయశంకర్‌ రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. హన్మకొండ ఆర్‌అండ్‌బీ ఏఈ వంగరి కోటేశ్వర్‌రావు కాంట్రాక్టర్‌ నుంచి రూ.50 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. చిట్యాల తహశీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే డిప్యూటీ తహశీల్దార్‌ కిరణ్‌ రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మహబుబాబాద్‌ జిల్లా, కురవి మండలం బలుపాల వీఆర్‌ఓ గౌసియాబేగం రూ.8 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయింది. జనగామ ఫైర్‌ అధికారి ఆర్‌.సత్యనారాయణ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. భీందేవరపల్లి మండలం వంగర వీఆర్‌ఓ గుమ్మడి రమేష్‌ రూ.5 వేలు, ఇరిగేషన్‌ కార్యాలయంలో పనిచేసే డీఈ వి.రఘుపతి, ఏఈ గాడిపల్లి గౌరిలక్ష్మీలు రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.

ఒక్క నెలలో మూడు కేసులు..
ఈ సంవత్సరం జనవరి నెలలోనే ముగ్గురు అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అవినీతి అధికారులపై ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై స్పందిస్తున్న అధికారులు అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ప్రజలను పీడీస్తున్న అధికారులకు ఏసీబీ అధికారులు దడ పుట్టిస్తున్నారు. మహబుబాబాద్‌ జిల్లా పరిశ్రమల కేంద్రం  జీఎం వి. వీరేశంను రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ములుగు ఇరిగేషన్‌ కార్యాలయం టెక్నికల్‌ అధికారి ఎం.ఆశలు రూ.20 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. తెలంగాణ రాష్త్ర ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయం సూపరింటెండెంట్‌ పల్లకొండ యాదగిరి రూ.64,500 లంచం పుచ్చుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

ఫిర్యాదులు చేస్తే స్పందిస్తాం
ప్రభుత్వ అధికారులు పనుల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన, లంచం డిమాండ్‌ చేసిన అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తే స్పందిస్తాం. ఫిర్యాదులపై విచారణ చేసి దాడులు నిర్వహిస్తాం. ఫిర్యాదు దారులు వాస్తవ విషయాలను మాత్రమే చెప్పాలి. వ్యక్తిగత కక్షలతో ఫిర్యాదు చేయరాదు. ఇక్కడ ప్రతి ఫిర్యాదుపై లోతైన విచారణ ఉంటుంది. అవినీతి అధికారులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఏ అధికారైన లంచం కోసం డిమాండ్‌ చేస్తే నేరుగా 1064,104 టోల్‌ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలి. దీంతో పాటు 9440446146 నంబర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతీ ఫిర్యాదును గోప్యంగా ఉంచుతాం. యువకులు, స్వచ్ఛంద సంస్థలు అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నవారి వివరాలు అందజేసిన విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. –కె.భద్రయ్య, వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top