లంచం ఇస్తేనే బిల్లు!

ACB Arrested AE Of Yellandu While Taking Bribe - Sakshi

సాక్షి, ఇల్లెందు: ఏసీబీ అధికారులకు ఇల్లెందు మున్సిపల్‌ ఏఈ అనిల్‌ పట్టుబడి ఆరు నెలలు గడవకముందే మున్సిపాల్టీలో మరో అవినీతి ఉద్యోగి, ఇన్‌చార్జ్‌ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న బాబు శుక్రవారం రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌ కథనం ప్రకారం.. ఇల్లెందు మున్సిపాలిటీలో ఇన్‌చార్జ్‌ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.బాబు కాంట్రాక్టర్‌ సురేశ్‌గౌడ్‌కు బిల్లు చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తుండటమే గాక కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడు. 14వ వార్డులో రూ.15 లక్షల విలువ గల తాగునీటి పైపులైన్‌ పనుల టెండర్‌ను కాంట్రాక్టర్‌ సురేశ్‌గౌడ్‌ దక్కించుకున్నాడు. నెల రోజుల కిందట టెండర్‌ పనులు పూర్తి చేశారు. బిల్లు కోసం పలు దఫాలు ఏఈని ఆశ్రయించగా ఏదో ఒక కారణం చెబుతూ దాట వేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. చివరికి రూ.30 వేలు ఇస్తేనే బిల్లు చేస్తానని సురేశ్‌కు హుకుం జారీ చేశాడు.

సురేశ్‌కు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వివరాలను నమోదు చేసుకున్న ఏసీబీ బృందం రంగంలోకి దిగింది. ప్రతిరోజూ పనులు ముగించుకున్న తర్వాత మధ్యాహ్న భోజనం చేసేందుకు డీఈ కొండల్‌రావు ఉంటున్న ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తారు. డీఈ ఇటీవల సెలవు పెట్టి ఇంటి తాళాలు బాబుకు అప్పగించి తన స్వగ్రామనికి వెళ్లారు. రోజువారీలాగే శుక్రవారం బాబు డీఈ కొండల్‌రావు ఇంటికి వెళ్లాడు. అనంతరం సురేశ్‌కు ఫోన్‌ చేసి డబ్బులను తీసుకొని తన వద్దకు రమ్మని చెప్పాడు. సురేశ్‌ వెంటనే విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపాడు. నిఘా వేసిన ఏసీబీ బృందం సురేశ్‌ నుంచి రూ.20 వేలు తీసుకుంటున్న ఏఈ బాబును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులు సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. 

లంచం ఇస్తేనే బిల్లు చేస్తా అన్నాడు..
పైపులైన్‌ పనుల టెండర్‌ దక్కించుకున్న నాటి నుంచి ఇన్‌చార్జ్‌ ఏఈ బాబు లంచం అడు గుతున్నాడు. పనులు పూర్తయినప్పటికీ బిల్లు చెల్లించేందుకు నిర్లక్ష్యం చేశాడు. రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బాబును పట్టించాను.         
సురేశ్, కాంట్రాక్టర్, ఇల్లెందు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top