7 కోట్ల మంది డేటాచోరీ

7 crore people data was been theft - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీగ్రిడ్స్‌ డేటా వివాదంలో వెలుగులోకి వస్తున్న అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాతోపాటు ఏపీలోని పలు జిల్లాలకు చెందిన దాదాపు 7కోట్ల మంది ఓటర్ల సమాచారం ఐటీగ్రిడ్స్‌ కంపెనీలో జరిపిన సోదాల్లో దొరికిందని తెలంగాణ హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది మహేష్‌ జెఠ్మలాని బుధవారం వెల్లడించారు. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన, బయట ఎక్కడా ఉండకూడని అత్యంతక కీలకమైన రహస్య సమాచారం ఐటీగ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వద్ద లభించిందని ఆయన న్యాయస్థానానికి నివేదించారు. ఐటీగ్రిడ్స్‌ కార్యాలయంలో తనిఖీలు చేసినప్పుడు అనేక ఆశ్చర్యకర వివరాలు తెలిశాయన్నారు. ఈ జాబితాను సదరు సంస్థకు ఎలా అందిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో అనే సమాచారం కూడా సోదాల్లో దొరికిందన్నారు.

తెలంగాణ, ఏపీకి చెందిన 7 కోట్ల మంది సమాచారం వీరి వద్ద ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చునన్నారు. ‘సేవా మిత్ర’యాప్‌ ద్వారా ఓటర్లను ఎవరికి ఓటు వేస్తారంటూ ఆరా తీసి, అధికార పార్టీకి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పిన వారి ఓట్లను పెద్ద ఎత్తున తొలగించారని కోర్టుకు నివేదించారు. ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌గా అశోక్‌ క్రిమినల్‌ చర్యలకు పాల్పడ్డారని, దర్యాప్తు నిమిత్తం హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీచేసినా స్పందనలేదన్నారు. దర్యాప్తునకు సహకరించడం లేదని, చట్టం, దర్యాప్తు సంస్థలంటే గౌరవం లేని ఇటువంటి వ్యక్తుల పట్ల కోర్టులు సానుకూల వైఖరిని ప్రదర్శించరాదన్నారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తి కాకపోవడంతో న్యాయమూర్తి షమీమ్‌ అక్తర్‌ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు.

ఓటర్ల డేటాచోరీ కేసులో తనపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అశోక్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా అశోక్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ, ఈ వ్యవహారం మొత్తం ఏపీ ఓటర్లకు సంబంధించిందని, అందువల్ల ఈ కేసును ఏపీకి బదిలీ చేయాలని ఆయన కోర్టును కోరారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top