లెక్క తేలింది..

42 members Arrest In Vehicle Scam Case hyderabad - Sakshi

మొత్తం నిందితులు 42 మంది!

వీరిలో తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల వారు

సహకరించిన వారిలో ఆర్టీఏ ఏజెంట్లు, సిబ్బంది

‘వాహన స్కామ్‌’లో సీసీఎస్‌ పోలీసుల నిర్థారణ  

33 మందిపై నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు

సాక్షి, సిటీబ్యూరో: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు పదేళ్ల క్రితం నాటి ‘వాహన స్కామ్‌’ కేసు దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కేసులో ఆరు రాష్ట్రాలకు చెందిన మొత్తం 42 మందిని నిందితులుగా తేల్చిన అధికారులు 33 మందిపై నాంపల్లి కోర్టులో అభియోగాలు మోపారు. ఇతర రాష్ట్రాల నుంచి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు ఖరీదు చేసుకువచ్చిన ఈ ముఠా నగరం కేంద్రంగా దందా చేసినట్లు తేల్చారు. ఇక్కడి వాహనాల ఇంజిన్, ఛాసిస్‌ నెంబర్లు మార్చడం ద్వారా అటు ఫైనార్షియర్లు, ఇటు ఇన్సూరెన్స్‌ కంపెనీలను మోసం చేసినట్లు గుర్తించారు. 2008 మే 28న నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల చొరవతో ఈ ముఠా గుట్టురట్టయింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ గ్యాంగ్‌పై ప్రాథమికంగా బహదూర్‌పుర ఠాణాలో నమోదైన ఈ కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ అయిందని డీసీపీ అవినాష్‌ మహంతి ‘సాక్షి’కి తెలిపారు. 

సిటీకి చెందిన వారే సూత్రధారులు...
ఈ అంతరాష్ట్ర వాహన స్కామ్‌ గ్యాంగ్‌లో నగరంలోని గుడిమల్కాపూర్‌కు చెందిన ఖాలీద్‌ అక్తర్‌ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. వృత్తిరీత్యా ఆర్టీఏ ఏజెంట్‌ అయిన ఇతడికి సహచర ఏజెంట్‌ గులాం జిలానీ (అత్తాపూర్‌), సంతోష్‌నగర్‌కు చెందిన పాత వాహనాల వ్యాపారి సయ్యద్‌ జఫార్, వాహనాల నెంబర్లు మార్చే సయ్యద్‌ గఫార్‌ తదితరులు సహకరించారు. వీరితో పాటు కొందరు ఆర్టీఏ ఏజెంట్లు, సిబ్బంది, వాహనాల డీలర్లు, మెకానిక్స్, ఫైనాన్స్‌ కంపెనీల సిబ్బంది పాత్రధారులుగా ఉన్నారు. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లోని వ్యక్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. వీరిలో ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్టీఏ సిబ్బంది సైతం ఉన్నారు. అక్కడ ఖండమైన, ప్రమాదాలకు గురైన వాహనాల ఆర్సీలను వీరి సహకారంతో ఖాదిల్‌ అక్తర్‌ తదితరులు రూ.35 వేల నుంచి రూ.40 వేలకు ఖరీదు చేసే వారు. వాటిని ఇక్కడికి తీసుకువచ్చి స్థానిక ఏజెంట్ల సాయంతో లోకల్‌ వాహనాలకు చెందినవిగా మార్చేవారు. అనంతరం పాత వాహనాల ఏజెంట్ల సహకారంతో కాలం చెల్లిన వాహనాలు, అసలే మనుగడలోనే లేని వాహనాలకు వీటిని వినియోగించే వారు. ఇలా తయారైన లోకల్‌ ఆర్సీలను ఒక్కోటి రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు విక్రయించే వారు.  

టైగర్‌ మార్కింగ్‌తో నంబర్లు మార్చేసి...
ఓ వాహనానికి ఉన్న రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో పాటు ఇంజిన్, ఛాసిస్‌ నెంబర్ల ఆధారంగానే దానిని గుర్తిస్తారు. టైగర్‌ మార్కింగ్‌ విధానంలో కేటుగాళ్లు ఇంజిన్, ఛాసిస్‌ నెంబర్లను మార్చేస్తారు. అప్పటికే వాటిపై ఉన్న అంకెలను వెల్డింగ్‌ చేయడం ద్వారా పూర్తిగా చెరిపేసి దాని స్థానంలో పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చిన ఆర్సీల్లోని నెంబర్లు ముద్రించేవారు. దీనికోసం టైగర్‌మార్కింగ్‌ విధానాన్ని అనుసరించేవారు. ఇలా రూపొందిన వాహనాలకు అప్పటికే ఫైనాన్స్‌ ఉన్నా, కాలం చెల్లిపోయినా ఆ విషయాన్ని ఆర్టీఏ అధికారులు, ఫైనాన్స్‌ చేసిన వారే కాదు.. చిరవకు దాని యజమానులూ గుర్తించలేక పోయేవారు. అనంతరం వాటికి అప్పటికే ఫైనాన్స్‌ ఉన్న వాటిపై పదేపదే ఫైనాన్స్‌లు తీసుకోవడం చేసేవారు. ఈ వ్యవహారంలో ఆయా ఫైనాన్స్‌ కంపెనీలకు చెందిన సిబ్బంది సైతం సహకరించారు. అనేక సందర్భాల్లో అసలు వాహనాలే లేనప్పటికీ కేవలం ఆర్సీల ఆధారంగా రుణాలు తీసుకుంటూ ఫైనాన్స్‌ సంస్థలకు  టోకరా వేశారు.  

16 మంది పట్టివేత ..
ఈ వాహన స్కామ్‌ గుట్టును 2008లో దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. మొత్తం 15 మందిని పట్టుకున్న అధికారులు వీరి నుంచి రెండు లారీలు, రెండు టిప్పర్లు, మరో రెండు కార్లతో పాటు 35 బోగస్‌ ఆర్సీలు, మార్పిడికి సిద్ధంగా ఉన్న మరో 20 ఆర్సీలు తదితరాలు స్వాధీనం చేసుకుని బహదూర్‌పుర పోలీసులకు అప్పగించారు. బహదూర్‌పుర పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేయగా... కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. దర్యాప్తు చేసిన ఆటోమొబైల్‌ టీమ్‌ అధికారులు మరో నలుగురిని అరెస్టు చేయగా... 13 మంది ముందస్తు బెయిల్‌ పొందారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన 9 మంది కోసం సీసీఎస్‌ పోలీసులు ముమ్మరంగా గాలించారు. వారు చిక్కకపోవడంతో స్వాధీనం చేసుకున్న వాహనాలకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలో పరీక్షలు చేయించారు. ఫలితంగా వాటి నెంబర్ల మార్పిడి జరిగినట్లు నివేదికలు వచ్చాయి. వీటి ఆధారంగా 33 మంది నిందితులపై సీసీఎస్‌ పోలీసులు గత వారం నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. నిందితులపై ఐపీసీలోని 420, 468, 471, 473, 474 తదితర సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top