భార్యను కడతేర్చేందుకే.. | ​​Husband Murder Attempt On Wife In Suryapet | Sakshi
Sakshi News home page

భార్యను కడతేర్చేందుకే..

Jun 17 2018 2:49 PM | Updated on Jul 30 2018 8:37 PM

​​Husband Murder Attempt On Wife In Suryapet - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనూష 

సూర్యాపేట క్రైం : భార్యను అడ్డుతొలగించుకోవాలని.. ఓ భర్త ఆమె తాగేనీటిలో నిద్రమాత్రలు కలిపి ఆమెకు ఇచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు అల్లి అనూష తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మట్టపల్లి సత్యనారాయణ– మాధవి దంపతులకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనూషను పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన మాధవి సొంత సోదరుడు అల్లి వరప్రసాద్‌ కుమారుడు సాయిశివకు ఇచ్చి గతేడాది ఏప్రిల్‌లో వివాహం చేశారు. పెళ్లి జరిగిన నాటి నుంచి భర్త సాయిశివ అనుషతో కాపురం చేయకుండా అనుమానంతో వేధించసాగాడు.

కొద్దిరోజుల నుంచి సైకోలాగా మారి భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. తమ కొడుకు చేష్టలు అత్త కౌసల్య, వదినలు శ్వేత, శృతికి చెప్పినా పట్టించుకోలేదు. పైగా అనూషపైనే ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో గురువారం సాయిశివ ఆవేశం తారస్థాయికి చేరుకుని భార్యపై బ్లేడు దాడిచేసి గాయపరిచాడు. అప్పటికీ సంతృప్తి చెందని సాయిశివ శుక్రవారం రాత్రి ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని తాగేనీళ్లలో నిద్రమాత్రలను పొడి చేసి కలిపి అనూషతో తాగించాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన అనూష తల్లిదండ్రుల సాయంతో స్థానిక ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు అనూష నుంచి ఫిర్యాదు స్వీకరించారు. పట్టణ ఎస్‌ఐ పి.శ్రీనివాస్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement