కరుగుతున్న వెండి కొండలు | Sakshi
Sakshi News home page

కరుగుతున్న వెండి కొండలు

Published Mon, Jan 29 2018 9:23 AM

Andhra Pradesh Temples to sale Silver Articles - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో వెండి నిల్వలు కొండల్లా పేరుకుపోతున్నాయి. శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల ఇలా ప్రముఖ దేవాలయాల్లో వేల కిలోల వెండి నిల్వలు ఉన్నాయి. వీటిని భద్రపరచడం ఆయా దేవస్థానాలకు భారంగా మారింది. బ్యాంకుల్లో వెండిని డిపాజిట్‌ చేస్తే వడ్డీ ఇచ్చే విధానం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని బ్యాంకుల్లో బాండ్ల రూపంలో దాచుకునే పథకాన్ని ప్రకటించి వడ్డీ కూడా చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేవాలయాలు తమ వద్ద ఉన్న వెండి నిల్వలను అమ్మి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏకంగా 21 వేల కిలోల వెండి నిల్వలు ఉన్నాయి. శని దోష నివారణకు భక్తులు శ్రీకాళహస్తిలో రాహు–కేతు పూజలు నిర్వహించి వెండి నాగ పడగలను సమర్పిస్తుంటారు. ఇక్కడే కాకుండా.. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల ఆలయాల్లో కూడా ప్రతి చోటా వెయ్యి కిలోలకు పైగా వెండి నిల్వలు పేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని బాండ్ల రూపంలో దాచుకునే పథకాన్ని ప్రకటించడంతో.. దేవుడి బంగారు ఆభరణాలను డిపాజిట్‌ చేస్తే బ్యాంకులు వాటి విలువ ఆధారంగా ఆలయానికి వడ్డీ చెల్లించే వెసులుబాటు ఏర్పడింది. వెండి నిల్వలను డిపాజిట్‌ చేస్తే వడ్డీ చెల్లించే విధానం లేకపోవడంతో వాటిని అమ్మేందుకు జేఎస్వీ ప్రసాద్‌ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వెండిని అమ్మి బంగారంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికనుగుణంగా డిసెంబర్‌లో శ్రీకాళహస్తి ఆలయం తమ దగ్గర ఉన్న వెండి నిల్వల్లో 14,935 కిలోల అమ్మకానికి ఈ – వేలం నిర్వహించింది.

10,282 కిలోల వెండితో 100 కిలోల బంగారం
శ్రీకాళహస్తిలో 14,935 కిలోల వెండి ఆభరణాలను కరిగించగా.. కడ్డీల రూపంలో స్వచ్ఛమైన వెండి 10,282 కిలోలు వచ్చింది. ఈ వెండి కడ్డీలను ప్రభుత్వ రంగ సంస్థ మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఎంటీసీ)కి అమ్మగా రూ.33.29 కోట్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తంతో ఎంఎంటీసీ ద్వారా తిరిగి వంద కిలోల బంగారాన్ని కొనుగోలు చేశారు. ఈ బంగారాన్ని బాండ్ల రూపంలో బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయనున్నట్టు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

శ్రీశైలంలో 2,400 కిలోల వెండి ఆభరణాలు ఉండగా, అందులో 500 కిలోలను కరిగించగా కడ్డీల రూపంలో స్వచ్ఛమైన వెండి 375 కిలోలు వచ్చినట్టు శ్రీశైల ఆలయ అధికారులు చెప్పారు. ఈ 375 కిలోల వెండిని ఎంఎంటీసీ ద్వారా అమ్మగా రూ.1.36 కోట్లు వచ్చాయి. ఈ మొత్తంతో 4.353 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement