వచ్చే మూడు దశాబ్దాలూ బంగారమే

World Gold Council on gold market - Sakshi

పసిడి ధరలపై ప్రపంచ స్వర్ణమండలి అంచనా

ముంబై: వచ్చే మూడు దశాబ్దాలూ బంగారం మార్కెట్‌ సానుకూలంగానే ఉంటుందని ప్రపంచ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. 2048 నాటికి చైనా ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, భారత్‌ కూడా దాని అడుగుజాడల్లోనే అభివృద్ధి చెందనుండడంతో బంగారం వెలుగులు కొనసాగుతాయని అంచనా వేసింది. ప్రపంచంలో బంగారం వినియోగం అత్యధికంగా చైనా, భారత్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. బంగారం డిమాండ్‌లో సగం ఆభరణాల రూపంలోనే ఉంటోంది.

ఈ నేపథ్యంలో నిరంతర అభివృద్ధి, చైనా, భారత్‌ తదితర వర్ధమాన దేశాల్లో మధ్య తరగతి వినియోగదారుల ప్రాతినిధ్యం పెరగడం బంగారం మార్కెట్‌కు సానుకూలతలుగా తన నివేదికలో పేర్కొంది. అయితే, బంగారం వెలుగులకు భౌగోళిక రాజకీయ పరంగా సవాళ్లు పొంచి ఉన్నాయని అభిప్రాయపడింది. అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలనూ ప్రస్తావించింది. అలాగే, యూరోప్‌లో దీర్ఘకాలం పాటు ఘర్షణ, పెరిగిపోతున్న వృద్ధ జనాభా అంశాలనూ ప్రతికూలతలుగా పేర్కొంది.

పెరిగే ఆదాయాలే బంగారంపై పెట్టుబడుల డిమాండ్‌ను నడిపిస్తాయని, హెచ్చు, తగ్గులున్నప్పటికీ ఇది సానుకూలంగానే ఉంటుందని వివరించింది. టెక్నాలజీలోనూ బంగారం వినియోగం పెరుగుతుందని అంచనా వేసింది. బంగారానికి డిమాండ్‌ పెరిగినా, గతంతో పోలిస్తే సరఫరాలో పెరుగుదల నిదానంగానే ఉంటుందని అంచనా వేసింది. 

డాలర్‌ బలోపేతం... రూపాయి బలహీనత వంటి పరిణామాలు కొనసాగితే దేశంలో బంగారం ధరలు 11 గ్రాముల ధర రూ.34,000కు దీపావళి నాటికి చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ 1,260–1,400 డాలర్ల మధ్య ట్రేడ్‌ కావొచ్చన్నారు. ద్రవ్యోల్బణంతో హెడ్జింగ్‌ కోసం బులియన్‌కు డిమాండ్‌ పెరగవచ్చని కూడా అంచనాలు ఉన్నాయి.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top