
న్యూఢిల్లీ: బ్రిటన్ సూపర్‌బైక్ బ్రాండ్ ట్రయంఫ్ రెండు మోడళ్లలో కొత్త వేరియంట్లను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్ట్రీట్ ట్విన్, స్ట్రీట్ స్క్రాంబ్లర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చామని ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా తెలిపింది. వీటి ధరలు రూ.7.45 లక్షల నుంచి రూ.8.55 లక్షల రేంజ్‌లో (ఎక్స్ షోరూమ్) ఉన్నాయని కంపెనీ జనరల్ మేనేజర్ షౌన్ ఫారూఖ్ పేర్కొన్నారు. ఈ రెండు బైక్‌లను 900 సీసీ హై–టార్క్ ప్యారలాల్ ట్విన్ ఇంజిన్‌తో రూపొందించామని పేర్కొన్నారు. స్ట్రీట్ ట్విన్ బైక్ ధర రూ.7.45 లక్షలని, స్ట్రీట్ స్క్రాంబ్లర్ ధర రూ.8.55 లక్షలని తెలిపారు. ఈ బైక్‌ల ‘పవర్’ను 18 శాతం పెంచామని, దీంతో వీటి పవర్ 65 పీఎస్‌కు పెరిగిందని వివరించారు. పవర్ పెంపుతో పాటు మరిన్ని అదనపు ఫీచర్లతో ఈ వేరియంట్లను అందిస్తున్నామని తెలిపారు. రెండేళ్ల తయారీ వారంటీని (కిలోమీటర్లతో సంబంధం లేకుండా) ఆఫర్ చేస్తున్నామని చెప్పారు.
మూడు నెలల్లో మరిన్ని వేరియంట్లు..
రానున్న మూడు నెలల్లో మరిన్ని కొత్త వేరియంట్లను అందుబాటులోకి తెస్తామని షారూఖ్ తెలిపారు. భారత 500 సీసీ కేటగిరీ బైక్‌ల్లో ప్రస్తుతం తమ మార్కెట్ వాటా 16 శాతంగా ఉందని వివరించారు. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియమ్ బైక్ బ్రాండ్ తమదేనని ఆయన తెలిపారు.