రూ.16,000 కోట్ల టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌

TCS announces share buyback of up to Rs 16000 crore - Sakshi

ఒక్కో షేర్‌ బైబ్యాక్‌ ధర రూ.2,100..

శుక్రవారం ముగింపు ధరకు ఇది 15 శాతం ప్రీమియం

రెండేళ్లలో రెండో షేర్ల బైబ్యాక్‌

ఈ సెప్టెంబర్‌ కల్లా పూర్తి  

న్యూఢిల్లీ: భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌)  రూ.16,000 కోట్ల మేర షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. ఒక్కో షేర్‌ను రూ.2,100 ధరకు మొత్తం 7.61 కోట్ల షేర్లను (కంపెనీ చెల్లించిన ఈక్విటీ షేర్‌ క్యాపిటల్‌లో ఇది 1.99 శాతానికి సమానం) కొనుగోలు చేయనున్నామని టీసీఎస్‌ తెలిపింది. శుక్రవారం ముగింపు ధర(రూ.1841)తో పోల్చితే షేర్‌ బైబ్యాక్‌ ధర (రూ.2,100) 15 శాతం అధికం.

శుక్రవారం సమావేశమైన తమ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని టీసీఎస్‌ వివరించింది. రెండేళ్లలో కంపెనీ చేపడుతున్న రెండో షేర్ల బైబ్యాక్‌ ఇదే. గత ఏడాది కూడా ఈ కంపెనీ ఇదే స్థాయిలో షేర్లను బైబ్యాక్‌ చేసింది. ఒక్కో షేర్‌ను రూ.2,850 ధరకు మొత్తం 5.61 కోట్ల షేర్లను ఈ కంపెనీ కొనుగోలు చేసింది.

అప్పటి బైబ్యాక్‌ మొత్తం రూ.16,000 కోట్లుగా ఉంది. అప్పుడు కూడా 18 శాతం ప్రీమియమ్‌ ధరను షేర్ల బైబ్యాక్‌ ధరను కంపెనీ నిర్ణయించింది.మిగులు నగదును వాటాదారులకు తిరిగి ఇచ్చే దీర్ఘకాల మూలధన కేటాయింపు విధానంలో భాగంగా ఈ షేర్ల బైబ్యాక్‌ను చేపడుతున్నామని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ  రాజేశ్‌  గోపీనాథన్‌ 50వ ఏజీఎమ్‌లో చెప్పారు.  

అప్పుడు రూ.850.. ఇప్పుడు రూ.16,000
ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా ఈ షేర్ల బైబ్యాక్‌ పూర్తవ్వగలదని  గతంలో టీసీఎస్‌కు అధినేతగా పనిచేసి, టాటా గ్రూప్‌కు ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖరన్‌ చెప్పారు. తాము ఐపీఓకు వచ్చినప్పుడు ఒక్క షేర్‌ను రూ.850కు కొనుగోలు చేస్తే, ఇప్పుడు దాని విలువ రూ.16,000 అయ్యిందని,  బోనస్‌లు, షేర్ల విభజనలను కలుపుకుంటే ఈ స్థాయి విలువ వస్తుందని తెలిపారు.   

వాటాదారులకు 98,000 కోట్ల చెల్లింపులు...  
2004లో స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యామని, అప్పటి నుంచి ఇప్పటిదాకా నగదు నిల్వల్లో 60 శాతం వరకూ(సుమారుగా రూ.98,192 కోట్లు) వాటాదారులకు పంచామని గోపీనాథన్‌ చెప్పారు. డివిడెండ్‌లు, షేర్ల బైబ్యాక్‌ల ద్వారా ఈ స్థాయిలో వాటాదారులకు నజరానాలిచ్చామని వివరించారు. కేవలం నాలుగు శాతం నగదు నిల్వలు (రూ.4,420 కోట్లు)ను మాత్రమే కంపెనీల కొనుగోళ్లకు వెచ్చించామని పేర్కొన్నారు.

ఆల్‌టైమ్‌ హైకి టీసీఎస్‌
షేర్ల బైబ్యాక్‌ ప్రకటన నేపథ్యంలో టీసీఎస్‌ షేర్‌ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో 3.1 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,849ను తాకింది. చివరకు 2.75 శాతం లాభంతో రూ.,1841 వద్ద ముగిసింది. ఈ జోరుతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌రూ.18,837 కోట్లు పెరిగి రూ.7,05,013 కోట్లకు ఎగసింది. రూ.7 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను దాటిన తొలి భారత కంపెనీగా అవతరించింది.

మార్కెట్‌ క్యాప్‌ పరంగా అగ్రస్థానంలో ఈ కంపెనీ నిలిచింది. తర్వాతి స్థానాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(రూ.6,42,363 కోట్ల మార్కెట్‌ క్యాప్‌), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(రూ.5,28,652కోట్లు), హిందుస్తాన్‌ యూనిలివర్‌(రూ.3,50,929 కోట్లు), ఐటీసీ(రూ.3,22,804 కోట్లు) లు నిలిచాయి.  గత నెల 25న ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ తొలిసారిగా రూ,.7 లక్షల కోట్లను దాటేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో పదివేల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి భారత కంపెనీగా టీసీఎస్‌ రికార్డ్‌ సృష్టించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top