
మైలేజీ పరీక్షలో తేడాలు..సుజుకీ సీఈఓ రాజీనామా
వాహనాల మైలేజీ పరీక్షల్లో మోసానికి పాల్పడ్డారనే వివాదం నేపథ్యంలో... జపాన్ కార్ల కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ సీఈఓ, చైర్మన్ ఒసాము సుజుకీ తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు.
♦ వినియోగదారులకు క్షమాపణ చెప్పిన సుజుకీ కంపెనీ
♦ డెరైక్టర్ల వేతనాల్లో కోత; కొందరి తొలగింపు
టోక్యో/న్యూఢిల్లీ: వాహనాల మైలేజీ పరీక్షల్లో మోసానికి పాల్పడ్డారనే వివాదం నేపథ్యంలో... జపాన్ కార్ల కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ సీఈఓ, చైర్మన్ ఒసాము సుజుకీ తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. డెరైక్టర్ల బోర్డులో చైర్మన్‌గా మాత్రం కొనసాగుతారు. ఈ వివాదం కారణంగా డెరైక్టర్ల వేతనాల్లో కోత విధించామని కూడా కంపెనీ తెలియజేసింది. రిప్రంజటేటివ్ డెరైక్టర్లు, డెరైక్టర్లకు గత ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన బోనస్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నామని, సీనియర్ మేనేజింగ్ ఆఫీసర్స్, మేనేజింగ్ ఆఫీసర్స్‌కు బోనస్‌లో 50 శాతం కోత కోస్తున్నామని తెలిపింది.
జపాన్‌లో వాహనాల కాలుష్యం, మైలేజీ పరీక్షలకు సంబంధించి అక్కడి లాండ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ టూరిజం శాఖ (ఎంఎల్‌టీ) విధించిన నిబంధలనకు... వాస్తవంగా సుజుకీ అనుసరిస్తున్న నిబంధనలకు తేడాలున్నట్లు బయటపడింది. దీన్ని సుజుకీ కూడా అంగీకరించి... క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 16 మోడళ్లకు సంబంధించి వివాదం రేగటంతో వాటన్నిటిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. ‘‘ఈ వివాదం జపాన్‌కే పరిమితం. జపాన్ వెలుపల విక్రయించే మోడళ్లకు ఇది వర్తించదు’’ అని సుజకీ మోటార్ కార్పొరేషన్ తెలియజేసింది. వివాదానికి సంబంధించి సుజుకీ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ ఒసాము హోండా కూడా తన పదవి నుంచి వైదొలగగా... రిప్రజెంటేటివ్ డెరైక్టర్లను కూడా కంపెనీ మార్చనుంది.
ఇండియాలో ఈ ప్రభావం ఉండదు...
జపాన్ పరీక్షల ప్రభావం ఇండియాలో ఉండదని... కాలుష్యం, మైలేజీకి సంబంధించి అక్కడి నిబంధనలకు, ఇక్కడి నిబంధనలకు చాలా తేడా ఉందని సుజుకీ ఇండియా ప్రతినిధి చెప్పారు. ఇక్కడ ఏఆర్‌ఏఐ, ఐకాట్, వీఆర్‌డీఈ వంటి ప్రభుత్వ అనుమతి ఉన్న ప్రైవేటు ఏజెన్సీలు వాహనాల కాలుష్యం, మైలేజీ పరీక్షలు జరుపుతాయి. ఇంధన సామర్థ్యాన్ని ఇవే సర్టిఫై చేస్తాయి. ఈ నివేదికల ఆధారంగా కంపెనీ స్వచ్ఛందంగా తన వాహనాల మైలేజీని ప్రకటిస్తుంది’’ అని ఆ ప్రతినిధి వివరించారు. జపాన్ ప్రభావం ఇక్కడి వాహనాలు, వాటి అమ్మకాలపై ఉండదన్నారు.