
న్యూఢిల్లీ: సబ్సిడీల ద్వారా ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం రెండో విడతకు కేంద్ర క్యాబినెట్ నేడు (గురువారం) ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు సబ్సిడీనిచ్చేందుకు రూ. 10,000 కోట్ల కేటాయింపులతో ఫేమ్–ఐఐ పథకాన్ని రూపొందించినట్లు వివరించాయి. అయితే, దీని వ్యవధి ముందుగా అనుకున్నట్లు అయిదేళ్లు కాకుండా మూడేళ్లకు మాత్రమే పరిమితం కానుంది. అలాగే, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్లకు ఉద్దేశించిన సబ్సిడీని.. ట్యాక్సీ సేవల సంస్థలకు మాత్రమే వర్తింప చేసే అవకాశం ఉంది.
విద్యుత్‌తో నడిచే బస్సులు, ట్యాక్సీ అగ్రిగేటర్స్ ఉపయోగించే ప్యాసింజర్ కార్లు, త్రిచక్ర వాహనాలు, 10 లక్షల ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై ఫేమ్– ఐఐ కింద రూ. 10,000 కోట్ల మేర సబ్సిడీ లభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘రెండో విడతలో రూ. 50 లక్షల దాకా ఖరీదు చేసే 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సుమారు 40 శాతం దాకా సబ్సిడీ లభిస్తుంది. 5 లక్షల త్రిచక్రవాహనాలకు రూ. 50,000 దాకా సబ్సిడీ ఉంటుంది. ప్రైవేట్ కార్లకు కాకుండా ట్యాక్సీ అగ్రిగేటర్స్ కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనం ఉంటుంది‘ అని పేర్కొన్నాయి. వాహనం కేటగిరీని బట్టి రెండో విడతలో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, పార్కింగ్ చార్జీలు మొదలైన వాటి నుంచి మినహాయింపులు కూడా లభించే అవకాశం ఉందని తెలిపాయి.