బీఎస్‌ఎన్‌ఎల్‌లో సమ్మె గంట

Strike Alert in BSNL Tamil Nadu - Sakshi

20 వేల మంది విధుల బహిష్కరణ

ధర్నాలతో నిరసనలు

సాక్షి, చెన్నై: డిమాండ్ల సాధన లక్ష్యంగా సోమవారం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ కార్మికులు సమ్మె గంట మోగించారు. 20 వేల మంది రాష్ట్రంలో విధుల్ని బహిష్కరించారు. ధర్నాలతో తమ నిరసన తెలియజేశారు.
4జీ సేవలు బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించాలని, ప్రైవేటీకరణ నినాదాన్ని వీడాలన్న పలు డిమాండ్లతో దేశ వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ కార్మికులు సమ్మె గంట మోగించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగ కార్మికులు కదిలారు. రాష్ట్రవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ సేవలు ఆగే పరిస్థితి. 90 శాతం మేరకు ఉద్యోగ, కార్మికులు విధుల్ని బహిష్కరించడంతో కార్యాలయాలన్నీ నిర్మానుష్యం అయ్యాయి. అన్ని రకాల సేవల్ని నిలుపుదల చేసిన ఉద్యోగ, కార్మికులు పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహిం చారు. ఆయా కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. చెన్నైలో అయితే, ప్రధాన కార్యాలయంతో పాటుగా బ్రాంచ్‌లలో సేవలు నిలిచిపోయాయి. ఉద్యోగ కార్మికులు సమ్మె బాట పట్టడంతో కార్యాలయాల వద్ద హడావుడి తగ్గింది. ఏదేని అత్యవసర పరిస్థితులు ఎదురైన పక్షంలో వాటిని కూడా బహిష్కరించే విధంగా నిరసనకారులు ముందుకు సాగుతున్నారు. ఈ సమ్మె బుధవారం వరకు సాగనుంది.

ఈ సందర్భంగా సంఘాల నేతలు పేర్కొంటూ, ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు గుప్పెట్లో ఉంచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. బలోపేతం చేయాల్సిన సంస్థను బలహీన పరిచే విధంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కేంద్రం దిగి వచ్చే వరకు తొలి విడతగా మూడు రోజుల సమ్మె సాగుతుందని, ఆ తదుపరి పాలకుల్లో స్పందన లేని పక్షంలో తీవ్రంగా పరిగణించే రీతిలో పోరు తప్పదని హెచ్చరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top